మల్లన్నసాగర్​పై సర్వే జరగాలి: కోదండరాం

మల్లన్నసాగర్​పై సర్వే జరగాలి: కోదండరాం

సిద్దిపేట, వెలుగు : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్​పై ప్రభుత్వం మరింత లోతుగా సర్వే చేయించాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం కోరారు. బుధవారం సిరిసిల్లకు వెళ్తున్న ఆయనను సిద్దిపేట శివారులో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కలిశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ గత పాలకులు నీటి లభ్యత లేని చోట్ల మల్లన్నసాగర్​ ప్రాజెక్టును నిర్మించారని, ఈ విషయాన్ని అనేకమార్లు టీజేఎస్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయిందన్నారు.

7 లేదా 8 టీఎంసీలు ఉండే విధంగా మల్లన్నసాగర్ నిర్మించాల్సి ఉండగా, 50 టీఎంసీల లక్ష్యంతో కట్టారన్నారు. మల్లన్నసాగర్ నిర్మించిన ప్రాంతం భూకంప జోన్ లో ఉందని ఎన్జీఆర్ఐ (నేషనల్ ​జియోఫిజికల్ ​రీసెర్చ్ ​ఇన్​స్టిట్యూట్) సైతం గుర్తించిందని, భూకంపాలు  వస్తే  విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందన్నారు. ఏడాదికి రెండు, మూడు పంటలు పండించే భూములను సేకరించి ప్రజలను నిర్వాసితులను చేశారన్నారు. మల్లన్నసాగర్ లో 10 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని నింపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, మల్లన్నసాగర్ పై ప్రజల్లో ఉన్న భయాలను కాంగ్రెస్ ​ప్రభుత్వం పోగొట్టాలన్నారు.

మల్లన్నసాగర్​లో ఎక్కువ నీటిని నిల్వ చేయకుండా చూడాలని, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్ , కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంతో నిర్వాసితులైన వారికి అండగా నిలవాలన్నారు. సిద్దిపేట, ములుగు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు పేరిట వేలాది ఎకరాలను గత ప్రభుత్వం సేకరించి ప్రజలకు అన్యాయం చేసిందని, ఇప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయని భూములను ప్రజా అవసరాలకు వినియోగించాలని డిమాండ్​ చేశారు. తర్వాత కోదండరాంకు రిటైర్డ్ ​టీచర్లు తమ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. నాయకులు బొమ్మల యాదగిరి, బాబు రావు పాల్గొన్నారు.