ఆత్మగౌరవమే గెలిచింది : కోదండరాం

ఆత్మగౌరవమే గెలిచింది : కోదండరాం
  •     కాంగ్రెస్​గెలుపుతో స్వేచ్ఛ వచ్చినట్టయ్యింది
  •     ప్రొఫెసర్​ కోదండరాం

వేములవాడ,వెలుగు : ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. బుధవారం వేములవాడలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఎన్నికైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పౌర సన్మానం చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ వేములవాడలో బలమైన శక్తులను తట్టుకొని ఆది శ్రీనివాస్  గెలవడం గొప్ప విషయమని, ప్రత్యర్థులు ఎన్ని రకాల కుట్రలు చేసినా పేదల నాయకుడు, ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చినట్టయ్యిందన్నారు.

గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో రూ.6  లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. అయినప్పటికీ రాష్ట్రంలో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి సమస్యపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు.  సభాధ్యక్షుడు నేరెళ్ల తిరుమల గౌడ్, జన సమితి జిల్లా అధ్యక్షుడు బొజ్జ కనకయ్య, ఆహ్వాన కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మై వేములవాడ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుడు మధు మహేశ్ పాల్గొన్నారు. 

పల్లె దవాఖాన ప్రారంభం

కోనరావుపేట, వెలుగు :  ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం కోనరావుపేట మండలం వట్టిమల్లలో కొత్తగా నిర్మించిన పల్లె దవాఖానను జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి ప్రారంభించారు. అనంతరం గ్రామంలోని కుల సంఘ భవనాలకు భూమిపూజ చేశారు.

ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ కొమ్ము స్వప్న, ప్యాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, ఉప సర్పంచ్ పుంగం గౌడ్,  కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మెడికల్​ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేణుమాధవ్, సీహెచ్ఓ బాలచందర్, సిబ్బంది పాల్గొన్నారు.