- స్పీడందుకున్న అప్రోచ్‌చానల్, పంప్ హౌస్ వర్క్స్
- సిద్ధంగా ప్రెషర్మెయిన్పైపులు
- మొదటి విడతలో రూ.1,400 కోట్ల నిధులు
మహబూబ్‌నగర్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ‘కొడంగల్’ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ముందుకు పడ్డాయి. జీవో 69 ద్వారా 2014లోనే ఈ లిఫ్ట్‌ను నిర్మించాలని అనుమతులు వచ్చినా, పనులు ప్రారంభించకుండా అప్పటి ప్రభుత్వం పక్కన పెట్టేసింది. పదేండ్ల తర్వాత 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీమ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
ఇరిగేషన్, ఇతర ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టులో కదలిక తీసుకొచ్చారు. స్కీమ్‌కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ గతేడాది పూర్తి కాగా, ఇటీవల దామరగిద్ద, కొడంగల్ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి.
మూడు విడతల్లో పనులు..
కొడంగల్లిఫ్ట్స్కీమ్ పనులను మూడు విడతలుగా చేపట్టనున్నారు. ప్రాజెక్టు కాస్ట్ రూ.4,885 కోట్లు కాగా, మొదటి విడత కింద రూ.2,945 కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ఈ రెండు ప్యాకేజీల్లో స్టేజ్-1 (కాట్రేవుపల్లి), స్టేజ్-2 (ఊట్కూరు/బాపూర్ ), స్టేజ్-3 (పేపరళ్ల జయమ్మ చెరువు) పంప్ హౌస్‌లు, పైపులైన్ పనులు చేపట్టనున్నారు.
ప్రస్తుతం రూ.1,400 కోట్లు మంజూరు కావడంతో పది రోజుల కింద స్టేజ్-1 పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మక్తల్ మండలం కాంట్రేవుపల్లి వద్ద అప్రోచ్‌చానల్, పంప్ హౌస్పనులకు శ్రీకారం చుట్టారు. ఈ స్టేజ్‌లో కాట్రేవుపల్లి పంప్ హౌస్ నుంచి మంథన్ గోడ్, కాచ్వార్ మీదుగా ఊట్కూరు పెద్ద చెరువు వరకు ప్రెషన్ మెయిన్ పైపుల ఏర్పాటు, ఇతర పనులు చేయనున్నారు. కాచ్వార్ వద్ద ప్రెషర్ మెయిన్ పైపులను సిద్ధంగా ఉంచారు. రెండో విడతలో కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీ సిస్టం డెవలప్మెంట్, చెరువుల కెపాసిటీని పెంచనున్నారు. మూడో విడతలో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు చేపట్టనున్నారు.
చెరువులుగా రిజర్వాయర్లు..
నారాయణపేట, -కొడంగల్, -మక్తల్ లిఫ్ట్ కింద మొత్తం పది రిజర్వాయర్లను నిర్మించనున్నారు. కొత్త రిజర్వాయర్ల నిర్మాణం చేపడితే ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉండడంతో, ఈ మూడు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న చెరువులనే రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం వాటికున్న నీటి నిల్వ కెపాసిటీని పెంచనున్నారు.
రిజర్వాయర్లుగా మక్తల్ నియోజకవర్గంలోని ఊట్కూర్ చెరువు, నారాయణపేట నియోజకవర్గం నారాయణపేట మండలంలోని జాజాపూర్ చెరువు, పేరపళ్ల గ్రామంలోని జాయమ్మ చెరువు, దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి చెరువు, కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ చెరువు, కొడంగల్చెరువు, హస్నాబాద్చెరువు, బొంరాస్‌పేట చెరువు, లక్ష్మీపూర్చెరువు, ఈర్లపల్లి చెరువులు అభివృద్ధి చెందనున్నాయి.
లక్ష ఎకరాలకు సాగునీరు..
ప్రాజెక్టు కింద నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాల్లోని పది మండలాల పరిధిలో ఉన్న లక్ష ఎకరాలకు సాగునీరు, 123 గ్రామాలకు తాగునీటిని అందించనున్నారు. ఈ మేరకు పది రిజర్వాయర్ల పరిధిలో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నారు. ప్రాజెక్టు వెంట గ్రీన్ బెల్ట్‌ను ఏర్పాటు చేయడంతో పాటు 56 హెక్టార్లలో మొక్కలను పెంచనున్నారు.
