ఆసియా కప్తో కోహ్లీ రీఎంట్రీ

ఆసియా కప్తో  కోహ్లీ రీఎంట్రీ

టీమిండియా కింగ్ ఖాన్..విరాట్ కోహ్లీ సుధీర్ఘ విరామం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నెల 27 నుంచి మొదలవనున్న ఆసియా కప్ లో కోహ్లీ ఆడబోతున్నాడు. ఈ మెగా టోర్నీ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మందితో కూడిన టీంలో కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు.  

కోహ్లీకి 100వ మ్యాచ్..
ఆగస్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ ప్రారంభం కానుంది. అయితే టీమిండియా తన తొలి మ్యాచ్ చిరకాల ప్రత్యర్థి పాక్తో తలపడనుంది. ఈ మ్యాచ్ ద్వారా కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఇది కోహ్లీ టీ20 కెరీర్లో 100వ టీ20 మ్యాచ్ కానుంది. ఈ నేపథ్యంలో తన వందో టీ20లో కోహ్లీ ఎలా చెలరేగుతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పైగా పాకిస్థాన్తో మ్యాచ్ అంటే కోహ్లీకి మరింత ఊపొస్తుందని..ఆ మ్యాచ్ లో కోహ్లీ పాక్కు చుక్కలు చూపించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతూ విరాట్కు అండగా నిలుస్తున్నారు. 

నిలకడలేమితో..
గత ఐపీఎల్లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 2010 తర్వాత కోహ్లీ 2022 ఐపీఎల్లో అంత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు బాదినా..సగటు మాత్రం 22.7 మాత్రమే. ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్కు దూరంగా ఉన్న కోహ్లీ..ఇంగ్లాండ్ పర్యటనలో బరిలోకి దిగాడు. ఇంగ్లాండ్ గడ్డపై కూడా కోహ్లీ విఫలమయ్యాడు. ఒక టెస్ట్, రెండు టీ20లు, రెండు వన్డేలు ఆడిన కోహ్లీ మొత్తంగా 76 పరుగులే చేశాడు. ఈ వైఫల్యంతో కొద్ది కాలం పాటు క్రికెట్కు  బ్రేక్ తీసుకుని  యూకేలో ఫ్యామిలీతో గడిపాడు. ఈ క్రమంలోనే విండీస్, జింబాబ్వే పర్యటనకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో అడుగుపెట్టబోతున్నాడు.