భారత క్రికెట్లో కోహ్లీ ఒక్కడే..

భారత క్రికెట్లో కోహ్లీ ఒక్కడే..

కింగ్ కోహ్లీ మరో రికార్డు సృష్టించబోతున్నాడు. సుధీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్లో ఆడబోతున్న విరాట్ కోహ్లీ.. అరుదైన ఘనత సాధించనున్నాడు. అన్ని ఫార్మాట్లలో వంద మ్యాచులు ఆడిన మొట్టమొదటి భారత క్రికెటర్గా చరిత్ర కెక్కనున్నాడు.  కోహ్లీ ఇఫ్పటి వరకు 102 టెస్టులు, 262 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. ఆదివారం ఆసియా కప్ టీ20లో భాగంగా  పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడనున్నాడు. ఇది కోహ్లీకి వందో టీ20 కానుంది. 

2008లో అరంగేట్రం..
2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో కోహ్లీ టీ20ల్లో అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఈ ఫార్మాట్ లో కోహ్లీ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటి వరకు అతను 99 టీ20లు ఆడాడు. 50.12 సగటుతో 3,308 పరుగులు సాధించాడు. టీ20ల్లో కోహ్లీ బెస్ట్ స్కోరు 94. ఈ ఫార్మాట్ లో కోహ్లీ 30 అర్థసెంచరీలు సాధించాడు. 

టీ20ల్లో కెప్టెన్ గా...
2017 నుంచి 2021 వరకు కోహ్లీ టీ20ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. తన కెప్టెన్సీలో టీమిండియా 50 టీ20లు ఆడింది. ఈ 50 మ్యాచుల్లో భారత్ 30 మ్యాచుల్లో విజయం సాధించగా..16 టీ20ల్లో ఓడిపోయింది. రెండు మ్యాచ్‌లు టైగా ముగియగా.. రెండింటిలో ఫలితం రాలేదు. టీ20లో కెప్టెన్‌గా కోహ్లీ విజయ శాతం 64.58.

సెంచరీ తర్వాత ఎన్ని టీ20లు ఆడాడంటే..?
విరాట్ కోహ్లీ చివరగా 2019లో ఇంటర్నేషనల్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్పై టెస్టు సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత అతను ఇప్పటి వరకు 27టీ20లు ఆడాడు. 42.90 సగటుతో 858 పరుగులు చేశాడు.  అత్యుత్తమ స్కోరు 94*.  చివరి సెంచరీ తర్వాత టీ20ల్లో 8 హాఫ్ సెంచరీలు సాధించాడు.  

విరాట్కు గడ్డు కాలం..
విరాట్ కెరీర్లో 2022 బ్యాడ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఈ ఏడాదిలో అతను అత్యంత క్లిష్టపరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఫాం లేమితో తంటాలు పడుతూ..విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు విరాట్..4 టీ20లు మాత్రమే ఆడాడు. 20.25 సగటుతో 81 పరుగులే చేశాడు. బెస్ట్ స్కోరు 52. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 16 మ్యాచులు ఆడగా..19 ఇన్నింగ్స్ లలో 25.05 సగటుతో 476 పరుగులు చేశాడు. 79 అత్యుత్తమ స్కోరు.  నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు. 2019లో చివరి సెంచరీ సాధించిన తర్వాత కోహ్లీ అన్ని ఫార్మా్ట్లలో 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 82 ఇన్నింగ్స్‌లలో 34.05 సగటుతో 2,554 పరుగులు చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 24 హాఫ్ సెంచరీలు కొట్టాడు.

అందరి దృష్టి కోహ్లీ పైనే...
ఆదివారం భారత్ పాక్ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉండనుంది. ముఖ్యంగా పాక్తో మ్యాచ్ అంటే కోహ్లీ రెచ్చిపోతాడు. దీనికి తోడు ఇది అతనికి 100వ టీ20 మ్యాచ్ కావడంతో...విరాట్పై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో టీ20 వరల్డ్ కప్లో పాక్తో జరిగిన మ్యాచ్లో అందరూ విఫలమైనా..కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 2021 టీ20 వరల్డ్ కప్లో భారత్ పాక్ మ్యాచులో కోహ్లీ 49 బంతుల్లో 57 పరుగులు సాధించాడు. ఇతర బ్యాట్స్మన్ విఫలైనా..కోహ్లీ రాణించి జట్టును ఆదుకున్నాడు. దీంతో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది.  అయితే పాకిస్తాన్ ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (79*), బాబర్ అజామ్ (68*) రాణించడంతో..భారత్ ఓడిపోయింది. 

కోహ్లీ రాణిస్తాడా..?
దాయాదితో పోరు ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో పాక్తో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయే కోహ్లీ ..ఆదివారం మ్యాచ్లో ఏం చేస్తాడో అని అభిమానులు ఆసక్తితో ఉన్నారు. పాక్తో మ్యాచ్తోనైనా ఫాంలోకి రావాలని కోరుకుంటున్నారు. తన వందో మ్యాచ్లో సెంచరీ సాధించాలని ఆశపడుతున్నారు. ఈ మ్యాచ్లో భారత్ను గెలిపించి..టీ20 వరల్డ్ కప్లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నారు.