ఫోటోలు లీక్.. ప్రొఫెసర్ను ఉద్యోగం నుంచి తీసేసిన యూనివర్సిటీ

ఫోటోలు లీక్.. ప్రొఫెసర్ను ఉద్యోగం నుంచి తీసేసిన యూనివర్సిటీ

కోల్కతా : కోల్కతాలోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్కు వింత అనుభవం ఎదురైంది. స్విమ్ సూట్ వేసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయన్న కారణంగా మేనేజ్మెంట్ ఆమెతో రాజీనామా చేయించింది. అంతేకాదు యూనివర్సిటీ పరువు తీసిందంటూ కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. వర్సిటీ వైఖరిపై ఆగ్రహించిన సదరు మహిళా ప్రొఫెసర్ న్యాయం కోసం కోర్టు మెట్లెక్కేందుకు సిద్ధమయ్యారు.

స్విమ్ సూట్ వేసుకుందని ఫిర్యాదు

కోల్కతాలోని సెయింట్ జేవియర్ యూనివర్సిటీకి చెందిన ఓ మహిళా ప్రొఫెసర్ ఏడాది క్రితం స్విమ్ సూట్లో ఫొటోలు దిగి తన ఇన్ స్టా అకౌంట్ స్టోరీలో పోస్ట్ చేశారు. అది ప్రైవేట్ అకౌంట్ కావడంతో తన ఫొటోలన్నీ సేఫ్గా ఉంటాయని భావించారు. తాజాగా యూనివర్సిటీ స్టూడెంట్ ఒకరు ప్రొఫెసర్ స్విమ్ సూట్లో ఉన్న ఫోటోను చూస్తున్న విషయాన్ని అతని తండ్రి గమనించాడు. విషయాన్ని యూనివర్సిటీ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఆమె వ్యవహారశైలి సరిగా లేదని కంప్లైట్ ఇచ్చారు. ఫిర్యాదుపై స్పందించిన యాజమాన్యం ప్రొఫెసర్ ఫొటోలు చూసి ఆమెను ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆదేశించింది. వర్సిటీ రెప్యూటేషన్ డ్యామేజ్ చేసినందుకుగానూ రూ.99 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది.

పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన ప్రొఫెసర్

ఇన్స్టా అకౌంట్లోని పర్సనల్ ఫోటోలు బయటకు రావడంపై సదరు మహిళా ప్రొఫెసర్ తొలుత ఆందోళనకు గురయ్యారు. తాను యూనివర్సిటీలో జాయిన్ కావడానికి కొన్ని నెలల ముందు తన రూమ్ లో బ్లూ స్విమ్ సూట్ లో రెండు పిక్స్ తీసుకున్నానని, గతేడాది వాటిని తన ప్రైవేట్ ఇన్ స్టా అకౌంట్ స్టోరీలో షేర్ చేసినట్లు ప్రొఫెసర్ చెబుతున్నారు. ఇన్ స్టా స్టోరీ కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుందని, అలాంటప్పుడు ఇప్పడు అవి ఎలా బయటకు వచ్చాయని ఆమె ప్రశ్నిస్తున్నారు. తన ఇన్ స్టా అకౌంట్ ను హ్యాక్ చేసిగానీ, లేక ప్రొఫైల్ యాక్సెస్ ఉన్న వారు స్క్రీన్ షాట్ తీసిగానీ సర్కులేట్ చేసి ఉంటారని, ఇది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని  ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు.

కోర్టు మెట్లెక్కిన ప్రొఫెసర్

మరోవైపు యూనివర్సిటీ వైఖరిపై మహిళా ప్రొఫెసర్ ఖంగుతిన్నారు. ఇన్ స్టా ప్రైవేట్ అకౌంట్లోని ఫోటోలు ఎలా బయటకు వచ్చాయన్న విషయం గురించి ఆలోచించకుండా తనను తప్పుబట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు నిజానిజాలు తెలుసుకోకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించిన సెయింట్ జేవియర్ యూనివర్సిటీపై కలకత్తా హైకోర్టులో కేసు దాఖలు చేసేందుకు రెడీ అయ్యారు. వర్సిటీ యాజమాన్యం తన వైఖరి, మాటల ద్వారా తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.