
- 9 మంది మృతి.. లోతట్టు ప్రాంతాలు జలమయం
- మృతుల్లో ముగ్గురు కరెంట్ షాక్‌తో దుర్మరణం
- నీట మునిగిన దుర్గామాత మండపాలు
- మెట్రో, లోకల్ ట్రైన్ల సర్వీసులకు అంతరాయం
- 100కు పైగా విమానాల రాకపోకలపై ప్రభావం
- కాలేజీ, స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
కోల్‌కతా: కోల్కతాలో కుండపోత వర్షం పడింది. సోమవారం అర్ధరాత్రి దాటాక మొదలైన వాన.. మంగళవారం ఉదయం కూడా కొనసాగింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సెంట్రల్ కోల్ కతా, సౌత్ కోల్‌కతాలోని రోడ్లు, వీధులు చెరువులను తలపించాయి. నడుము లోతు నీరు జమ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 3 గంటల్లో 18.50 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిటీ వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షాలకు సంబంధించిన ప్రమాదాల్లో సిటీలోని పలుచోట్ల మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు కరెంట్ షాక్‌తో చనిపోయారు.
దుర్గా పూజకు నగరమంతా సిద్ధమవుతుండగా వర్షం పడడంతో మండపాలన్నీ నీట మునిగాయి. చాలాచోట్ల విగ్రహాలు వరదకు కొట్టుకుపోయాయి. దుర్గాపూజా కార్యక్రమాన్ని సీఎం మమతా బెనర్జీ రద్దు చేసుకున్నారు. మరోవైపు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 100కు పైగా విమానాలు ప్రభావితం అయ్యాయి. 62 సర్వీసులను ఎయిర్‌పోర్టు అధికారులు రద్దు చేయగా.. 42 ఫ్లైట్లు ఆలస్యంగా సిటీకి చేరుకున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లించారు. రన్‌వేపై భారీగా నీరు చేరడంతో కోల్‌కతా ఎయిర్‌పోర్టు చెరువును తలపించింది.
మెట్రో, లోకల్ ట్రైన్ సర్వీసుల్లో అంతరాయం
కోల్‌కతాలోని బేనియాపూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహట్, ఏక్‌బల్‌పూర్, బెహాలాతో పాటు హరిదేవ్‌పూర్ ఏరియాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. సబర్బన్ రైలు, మెట్రో సర్వీసులను అధికారులు నిలిపివేశారు. కొన్ని ఏరియాల్లో కార్లు, బైకులు నీట మునిగాయి. పలుచోట్ల వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లల్లోకి వరదనీరు చేరింది. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. మంగళవారం స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం
సీఎం మమతా బెనర్జీ సీఎస్, మేయర్, ఇతర శాఖల అధికారులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. బుధవారం కూడా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ ఇంటి నుంచే వర్క్ చేయాలని సూచించారు. చనిపోయిన 9 మంది కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని విద్యుత్ శాఖను సీఎం ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో వరద బాధితులు
గరియా కాదాంబరిలో అత్యధికంగా 33.20 సెంటీ మీటర్ల వర్షం పడింది. జోధ్‌పూర్ పార్క్‌లో 28.50, కాళీఘాట్‌లో 28, తోస్పియాలో 27.50, బల్లీగంజ్‌లో 26.40 సెం.మీ.వాన పడింది. కోల్కతాలో ఇంతటి భారీ వర్షం ఎప్పుడూ చూడలేదని సిటీ మేయర్, టీఎంసీ సీనియర్ నేత ఫిర్హాద్ హకీం తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో బాధితుల కోసం ఫుడ్, తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరెంట్ షాక్‌తో ముగ్గురు చనిపోవడంతో ఎలక్ట్రిక్ పోల్స్, వైర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో కోల్కతాలో 24.75 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.