
చండూరు, వెలుగు: మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్చెప్పి నెలలు గడుస్తోందని, నేటి వరకు ఎక్కడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం చండూరులో స్థానిక గాంధీజీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పిన టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని అన్నారు. మునుగోడులో కేవలం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి నియోజకవర్గంతో పాటు జిల్లాకు నిధులు ఇస్తామని చెప్పారని, ఇప్పటివరకు నిధులు రాలేదన్నారు. చండూరు పట్టణంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మున్సిపాలిటీని దత్తత తీసుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని ఇచ్చిన హామీలు వచ్చే ఎన్నికలలోపు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రోడ్డుకెక్కాయన్నారు. రేవంత్ రెడ్డి గురించి తాను పార్టీలో ఉన్నప్పుడే చెప్పానని, ఇప్పుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారన్నారు. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేయడం కన్నా రాజకీయాలను వదిలేయడం బెటర్ అని అన్నారు.
నీతి నిజాయతీతో కూడిన పాలన బీజేపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి నాగొల్ల కురుమలను టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందన్నారు. అకౌంట్లో పైసలు వేసి ఎన్నికలు అయిపోయాక మళ్లీ రిటర్న్ తీసుకుందన్నారు. తెలంగాణను అప్పులపాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో ఉచిత విద్య, వైద్యం ఉందా.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా... ఏం ఉద్ధరించడానికి బీఆర్ఎస్ పెట్టినట్లని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి పని చేయాలని పార్టీలో చేరాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను ఆహ్వానించారు.