ఐలమ్మ స్ఫూర్తితో ధర్మం వైపు నిలబడి పోరాడండి

ఐలమ్మ స్ఫూర్తితో ధర్మం వైపు నిలబడి పోరాడండి

యాదాద్రి భువనగిరి జిల్లా :  తన కోసం కాకుండా ఇతరుల కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఐలమ్మ స్ఫూర్తి తో ధర్మం వైపు నిలబడి ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు, పేదలకు మానవత్వంతో చేసే సేవనే  చాకలి ఐలమ్మకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ‘‘ఎవ్వరూ వెయ్యేండ్లు బతకరు.. బతికిన కొద్ది రోజులైనా ఐలమ్మలాగా ధీరత్వంతో బతకాలి’’ అని చెప్పారు. మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలంలోని స్వాముల వారి లింగోటం గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, గంగిడి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణలో దొరలను ఎదిరించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని అన్నారు. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని చూస్తే..  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆమె చేసిన త్యాగాలు, పోరాటాలు గుర్తుకు రావాలని చెప్పారు. పోరాటాలు, త్యాగాలకు మారుపేరు నల్లగొండ గడ్డ అని కొనియాడారు.