రోడ్డుపై సామాన్యుడిలా రాజగోపాల్ రెడ్డి

రోడ్డుపై సామాన్యుడిలా రాజగోపాల్ రెడ్డి
  • మునుగోడు వీధుల్లో సామాన్యుడిలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సామాన్యుడిలా మారిపోయారు. మునుగోడులోని రోడ్లపై కాలి నడకన సంచరిస్తూ.. అందర్నీ ఆప్యాయంగా పలుకరించారు. కనిపించిన  వారి క్షేమ సమాచారాలు.. కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కాకా హోటల్లో సామాన్యులతో కలసి టీ తాగి.. అక్కడున్న వారితో మాటా మంతీ జరిపారు. రోడ్లపై స్వేచ్ఛా జీవిలా తిరుగుతూ రోడ్డుపై చిరు వ్యాపారులను... దారిన వచ్చీ వెళ్లే వారిని ఆప్యాయంగా పలుకరించారు. నిన్నటి దినం అసంఖ్యాక జనసందోహంతో ‘బీజేపీ సమర భేరి’ సభలో అమిత్ షా సమక్షంలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి ఇవాళ సామాన్యుడిలా మారి రోడ్లపైకి రావడం స్థానికులను విస్మయానికి గురి చేసింది. 

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ కండువా మెడలో వేసుకుని రోడ్లపై సామాన్యుడిలా కలియ తిరుగుతుండడం స్థానికంగా వైరల్ అయింది. స్థానికులు ముఖ్యంగా యువతీ యువకులు రాజగోపాల్ రెడ్డితో సెల్ఫీ ఫోటోలు.. వీడియోలను తీసుకునేందుకు ఎగబడ్డారు. తీసుకున్న ఫోటోలు, వీడియోలను తమ స్నేహితులు.. సన్నిహితులకు వెంటనే వెంటనే షేర్ చేశారు. దీంతో రాజగోపాల్ రెడ్డి  మునుగోడు చుట్టు పక్కల ప్రాంతాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఏం జరుగుతోంది..? ఏం చేస్తున్నారు..? ఎక్కడికెళ్తున్నారు..?  అప్పుడే ఎన్నికలొచ్చాయా..?  అంటూ.. రాజగోపాల్ రెడ్డి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబరిచారు.