మూడు నెలలు కేసీఆర్ ని నిద్ర పోనియ్యలే: రాజగోపాల్ రెడ్డి

మూడు నెలలు కేసీఆర్ ని నిద్ర పోనియ్యలే: రాజగోపాల్ రెడ్డి

కొద్దిరోజులు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళినా సరే మీరు తలదించుకునే పని తాను చేయలేదని.. ఆ మూడు నెలలు కేసీఆర్ ని నిద్రపోనివ్వలేదని.. కేసీఆర్  ని మీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చానని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పార్టీ మారినా.. మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చినా.. తన ఏకైక లక్ష్యం కేసిఆర్ నియంత పాలనను గద్దే దించడమేనని చెప్పారు. ఒక ఎమ్మెల్యే ను ఓడించడానికి కేసీఆర్.. ప్రభుత్వం యంత్రాంగం, వందమంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడానని.. మునుగోడు ప్రజలు ఎక్కడ కూడా తల దిలించుకునేలా చేయలేదని చెప్పారు. ఆనాడు ఎంపీగా తనను పార్లమెంటుకు పంపిస్తే.. తెలంగాణ గొంతు వినిపించి రాష్ట్రం తీసుకోరావడానికి  కష్టపడ్డానన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ  ఒక కుటుంబం చేతిలోకి పోతే.. ఆ కుటుంబాన్ని గద్దే దించడానికి పోరాడుతున్నానని చెప్పారు. అధికారంలో ఉన్న లేకపోయినా నా సొంత డబ్బులతో పేద ప్రజలకు సహాయం చేశానని తెలిపారు.

 కాంగ్రెస్ పార్టీ తనకు రాజకీయ జన్మనిచ్చిందని చెప్పారు. చిరుమర్తి లింగయ్య మోసం చేసి వెళ్లిపోయాడని... ఇప్పుడు గెలుస్తాడా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ సంచలనం జరగాలన్నా.. రాజకీయ పెను తుఫాను రావాలన్నా మునుగోడు గడ్డమీది నుంచే జరుగుతుందని అన్నారు. మునుగోడు గడ్డ.. కెసిఆర్ ను మూడు నెలలు నిద్ర పట్టకుండా చేసిందన్నారు. అమ్ముడుపోయిన వ్యక్తిని అయితే మళ్లీ కాంగ్రెస్ లోకి ఎలా వస్తానన్నారు. 

అమ్ముడుపోయానని తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులకు ఒకటి చెప్తున్నానని.. తనను కొనే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని రాజగోపాల్ రెడ్గి అన్నారు.  మీరు కాంగ్రెస్ లోకి రావాలని వేల మంది కార్యకర్తలు, నాయకులు అడిగారని చెప్పారు. తాను పదవి త్యాగం చేసినా.. పదవిలో ఉన్నా.. అది ప్రజల కోసమే అని చెప్పారు.

తన పదవి మునుగోడు ప్రజల కోసం వదిలిపెట్టానని...  నా చేతిలో ఉన్న రాజీనామా అస్త్రాన్ని వదిలితే ప్రగతి భవన్ గోడలు బద్దలయ్యాయన్నారు. తన రాజీనామా వల్లే...గట్టుప్పల్ మండలం ఏర్పాటు అయ్యిందని..  చండూరును రెవిన్యూ డివిజన్ చేశారు.. చౌటుప్పల్ కు వంద పడకల ఆసుపత్రి ఇచ్చారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ తన సొంతిల్లు అని.. తాను మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తే తప్పేంటని అన్నారు. ఆస్తులు వదులుకుంటున్నా... అవమానాలు భరిస్తున్నా... కుటుంబం అంతా బాధపడినా.. కెసిఆర్ పాలన గద్దే దించడానికే అని అన్నారు.తాను గజ్వేల్ లో పోటీ చేస్తానని  ఏఐసీసీకి చెప్పానన్నారు. లక్ష కోట్లు అప్పు చేసి కట్టిన కాళేశ్వరం కూలిపోతుందని విమర్శించారు. ధరణి పోర్టల్ ద్వారా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటా అందరిని కలుస్తానని.. మన మధ్య గొడవలు ఉండొద్దని చెప్పారు.

కేసీఆర్ ఓటమి కోసమే బీజేపీలో చేరా

బీజేపీలో చేరింది కేసీఆర్ ఓటమి కోసమేనని... కానీ మీరు కేసీఆర్ ను మరోసారి సీఎం చేసేలా ఉన్నారని అమితాషాని అడిగానని చెప్పారు. కవిత అరెస్ట్ అయ్యేలా లేదని..తన పని అయ్యే దగ్గరకు వెళ్తానని ముక్కుసూటిగా చెప్పానన్నారు.కేసీఆర్ కుటుంబం అవినీతిలో కురుకుపోయిందని.. వాళ్ళను అరెస్ట్ చేస్తే బీజేపీలో ఉంటా అని చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు.