బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ల వార్ 

బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ల వార్ 
  • లిక్కర్ స్కామ్ లో రేవంత్ ఉన్నడు: రాజగోపాల్ రెడ్డి
  • చిల్లర కథలు మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవ్: రేవంత్ 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య శుక్రవారం ట్వీట్ల వార్ నడిచింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ ​రేవంత్ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. లిక్కర్ స్కామ్ లో రేవంత్ కు సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించిన రాజగోపాల్ రెడ్డి.. ‘‘ప్రగతిభవన్, గాంధీభవన్ భాయ్ భాయ్. రేవంత్ రెడ్డి నాటకాలకు, కల్వకుంట్ల కవిత డ్రామాలకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెరదించింది. ఢిల్లీలో తీగ లాగితే ప్రగతిభవన్, గాంధీభవన్​ వ్యాపార సంబంధాల డొంక కదిలింది” అని ట్వీట్ చేశారు. కవిత కంపెనీలో రేవంత్ డైరెక్టర్ గా ఉన్నట్టు వచ్చిన వార్తా క్లిప్పింగ్ ను పోస్టు చేశారు. 

దీనిపై రేవంత్ ​స్పందించారు. చచ్చిన బర్రె పగిలిన కుండ నిండా పాలిచ్చిందన్నట్టు రాజగోపాల్ వ్యవహారం ఉందని మండిపడ్డారు. ‘‘రాజగోపాల్ ఆరోపిస్తున్న ‘అడికోర్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ప్రైవేటు లిమిటెడ్’ కంపెనీలో 2010 ఫిబ్రవరి 2న డైరెక్టర్​గా చేరాను. తర్వాత 13 రోజులకే ఫిబ్రవరి 15న రిజైన్ చేశాను. ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో ఆ కంపెనీ క్లోజ్ అయింది. ఇలాంటి చిల్లర కథలు మునుగోడులో మిమ్మల్ని కాపాడలేవు’’ అని ట్వీట్ చేశారు. తన రాజీనామాకు సంబంధించిన పేపర్లను ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ ట్వీట్ పై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ‘‘క‌‌విత‌‌తో క‌‌లిసి చీక‌‌టి వ్యాపారాలు చేసిన‌‌ట్టు మీరే ఒప్పుకున్నారు. 13 రోజులు చేసినా.. 13 గంట‌‌లు చేసినా.. మొత్తానికి క‌‌లిసే చేశారు క‌‌దా. 13 రోజులు మీరు ఉండి, త‌‌ర్వాత 12 ఏండ్లుగా మీ బామ్మర్దిని బినామీగా పెట్టి మీ చీక‌‌టి వ్యాపారాలు న‌‌డిపిస్తున్నట్లు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.