కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
  • పదేండ్లు ఆమెకు బీసీలు ఎందుకు గుర్తుకురాలే?: మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి 
  • లిల్లిపుట్​లు, కవిత గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోం
  • లోకేశ్ చిన్న పిల్లోడు.. అతని వ్యాఖ్యలపై మాట్లాడను   
  • బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని వెల్లడి

నల్గొండ, వెలుగు: బీసీ ఉద్యమానికి.. బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం ఉందని దీక్ష చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. ఆమె దీక్ష పెద్ద జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు. గత పదేండ్లు ఆమెకు బీసీలు గుర్తుకురాలేదా అని మంత్రి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రూ.200 కోట్లతో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఇప్పటికే కొందరిపై చర్యలు తీసుకున్నాం. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఏం జరగాలో అదే జరుగుతుంది. లిల్లిపుట్​ల గురించి, కవిత గురించి మాట్లాడి సమయం వృథా చేసుకోం. లోకేశ్ లాంటి చిన్నపిల్లోడి వ్యాఖ్యలపై నేను మాట్లాడను. బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతాం. అవసరమైతే కేంద్రంతో కొట్లాడుతాం.. బనకచర్ల చాప్టర్ క్లోజ్’’ అని ఆయన అన్నారు.

బీఆర్ఎస్ పని అయిపోయిందని, పదేండ్లు పరిపాలన చేసిన పార్టీ.. 16 ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయిందని, ఒక్క స్థానానికి మాత్రమే డిపాజిట్ వచ్చిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తులో ఉండదని, దాని గురించి తాను మాట్లాడనని కోమటిరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ లో ఐదు గ్రూపులు ఉన్నాయని.. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ గ్రూపులు నడుపుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి  ట్యాపింగ్ చేస్తున్నారని కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు.

జాతీయ పార్టీలో అలాంటి నీచమైన పనులు చేయరు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని అంటున్నారు. కానీ, ఎప్పటినుంచో నా నంబర్ అదే ఉంది. దాన్నే కొనసాగిస్తున్నా”అని అన్నారు. దోచుకునేటోళ్లే ట్యాపింగ్ చేస్తారని, ప్రభాకర్ రావును పెట్టి 670 మంది రాజకీయ, సినీ, పారిశ్రామిక వేత్తల ఫోన్లు ట్యాపింగ్ చేసిన కేటీఆర్.. 16 నెలలు ప్రభాకర్ రావును అమెరికాలో దాచిపెట్టి  ఇప్పుడు మా మీదనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు.