నల్గొండ అర్బన్, వెలుగు: రానున్న రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) భవనం మొదటి అంతస్తును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం న్యాక్ ద్వారా విస్తృతంగా చర్యలు చేపడుతోందన్నారు. రాష్ట్రంలో నిర్మించిన న్యాక్ భవనాల్లో నల్గొండ న్యాక్ మొదటిదని తెలిపారు.
ఈ కేంద్రం ద్వారా ఎలక్ట్రిషన్, ప్లంబర్, మెకానిక్, వెల్డర్, కార్పెంటర్, డెకరేషన్, సీసీటీవీ, కంప్యూటర్ తదితర విభాగాల్లో శిక్షణ అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు. కార్మిక శాఖ సహకారంతో న్యాక్ ఆధ్వర్యంలో 60 మంది మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం రాష్ట్ర స్కిల్ యూనివర్సిటీతో పాటు ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
నల్గొండలో ఇప్పటికే రూ.84 కోట్లతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్, రూ.5 కోట్లతో సెట్విన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారధి సంస్థ ద్వారా 100 మంది యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోగా, జాక్వార్ సంస్థతో రూ.25 లక్షల వ్యయంతో ల్యాబ్ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఇన్స్ట్రక్టర్ స్నేహలతను మంత్రి సన్మానించారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
