మల్లన్న కల్యాణానికి కొమురవెల్లి రెడీ

మల్లన్న కల్యాణానికి కొమురవెల్లి రెడీ
  •     21 నుంచి జాతర
  •     ఇంకా పూర్తికాని పనులు

సిద్దిపేట, వెలుగు : మల్లన్న కల్యాణానికి కొమురవెల్లి రెడీ అయింది. ఆదివారం జరిగే స్వామివారి కల్యాణోత్సవంతో భక్తుల రాక మొదలవుతుంది. ఈ నెల 21న పట్నం వారంతో మొదలై మూడు నెలలు జాతర కొనసాగుతుంది.  రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్​గడ్​, కర్నాటక రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారు. వారాంతంలో రోజుకు 30వేల మంది వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఆలయ ఏర్పాట్లపై అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారు.  ప్రజాప్రతినిధులు మాటలే తప్ప అభివృద్ధి పనులపై దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. 

తాగునీటికి కొరత

కొమురవెల్లి మల్లన్న ఆలయంతో పాటు పరిసరాల్లో తాగునీటికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలయం వద్ద మొక్కుబడిగా ఏర్పాటు చేసిన కుళాయి తప్పించి భక్తుల  సంఖ్యకు  తగ్గట్టు ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు అందించడం కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు.   ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ తాగునీటి కుళాయిలు అలంకార ప్రాయంగా మారాయి.

నత్తనడకన అభివృద్ధి  పనులు

భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన పలు అభివృద్ధి  పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్వామి వారి దర్శనం కోసం  వచ్చే భక్తుల కోసం రూ.12 కోట్ల అంచనాతో  ప్రారంభించిన క్యూ లైన్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మల్లన్న గుట్టపై రూ. 10 కోట్ల వ్యయంతో 50 గదుల సత్రం పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.  నాలుగు సంవత్సరాల కిందప్రారంభమైన సత్రం పనులు ఇంకా యాభై శాతానికి మించి జరగలేదు.  భక్తులు వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేటు గదులను అద్దెకు తీసుకోవడమో లేక  రోడ్ల పక్కనే గుడారాలు వేసుకోవడమో జరుగుతోంది.

అండర్ పాస్ నిర్మాణంతో ఇక్కట్లు

రాజీవ్ రహదారి  కొండపాక గేట్ నుంచి  కొమురవెల్లికి వెళ్లే మార్గంలో  రైల్వే అండర్ పాస్ నిర్మాణం రాక పోకలకు తీవ్ర ఆటంకంగా మారింది. కొమురవెల్లి హాల్ట్ స్టేషన్ సమీపంలో అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వాహన రాకపోకలను మళ్లించారు. వ్యవసాయ పొలాల గుండా తాత్కాలిక రోడ్డును నిర్మించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  రాత్రి వేళల్లో ఎగుడు దిగుడు రోడ్డు మూలంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పారిశుధ్యం అధ్వానం 

కొమురవెల్లిలో పారిశుధ్యం అధ్వానంగా మారింది. కనీస వసతి సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు రోడ్డు పక్కనే గుడారాలు వేసుకుని వంటా వార్పు చేసుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలలో చెత్త పేరుకుపోతుంది.  భక్తుల స్నానాల కోసం ఏర్పాటు చేసిన షవర్లు అలంకార ప్రాయంగా మారాయి.  మల్లన్న కోనేరు తో పాటు తోట బావి వద్ద స్నానాలు చేసిన  మహిళలు దుస్తులు మార్చుకోవడానికి  ఇబ్బంది పడుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టాయిలెట్లు సిద్ధం చేయడంలేదు. గతంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటుచేసినా ప్రస్తుతం విస్తరణలో భాగంగా వాటిని తొలగించి చదును చేశారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం
 

కొమురవెల్లి  మల్లికార్జునస్వామిజాతరకు వచ్చే భక్తులకు అవసరమైన విధంగా సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం.  కల్యాణంతో పాటు మూడు నెలల జాతరకు వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించి ఎలాంటీ ఇబ్బందులు లేకుండా చేస్తాం.  అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం.

బాలాజీ, ఆలయ ఈఓ

మల్లన్న జాతర షెడ్యూల్​

07/1/2024                      మల్లన్న కల్యాణోత్సవం
21/1/2024    మొదటి వారం(పట్నం వారం)
28/1/2024    రెండో వారం (లష్కర్ వారం)
08/04/2024    మహాశివరాత్రి(పెద్ద పట్నం)
09/4/2024    అగ్ని గుండాలు(జాతర సమాప్తి)