- వాటిని నివారించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి
- పంటలు నాశనం అవుతున్నాయని ఆవేదన
- వికారాబాద్ జిల్లా రైతుల పరిస్థితిని వివరించిన ఎంపీ
- బాధ్యత వహించేందుకు ‘నోడల్ మినిస్ట్రీ’ని కేటాయించాలని వినతి
న్యూఢిల్లీ, వెలుగు: కోతుల సమస్య అసలు ఏశాఖ కిందకు వస్తుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అటవీ, వన్యప్రాణులు, అగ్రికల్చర్, రైతుల సంక్షేమ శాఖ ఇలా... ఏ శాఖను ఆశ్రయించినా ఇది తమ పరిధిలోనిది కాదంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతులను తీవ్రంగా వేధిస్తున్న కోతుల బెడదపై గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో విశ్వేశ్వర్‌రెడ్డి ప్రస్తావించారు. తన నియోజకవర్గ పరిధిలోని వికారాబాద్ జిల్లాలో కోతుల సమస్య తీవ్రంగా ఉన్నదని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యపై ఆయన తెలుగులో మాట్లాడారు. ‘‘మా వికారాబాద్ జిల్లాలో రైతులకు కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. పంటలన్నీ నాశనమవుతున్నాయి’’ అని పేర్కొన్నారు. కోతుల బెడద నివారణకు నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మాకు సంబంధం లేదంటున్నారు..
కొతుల బెడద ఒక జిల్లా, తెలంగాణకు మాత్రమే పరిమితం కాలేదని.. ప్రస్తుతం జాతీయస్థాయి సమస్యగా మారిందని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఏ శాఖను సంప్రదించినా ఈ అంశం తమది కాదని అంటున్నాయని, దీనిపై తాను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అప్లై కూడా చేశానని, అయితే, విస్తుపోయే సమాధానాలు వచ్చాయని తెలిపారు. ‘‘జనావాసాలు, వ్యవసాయ పంటలకు జరిగే నష్టానికి తమకు సంబంధం లేదని అటవీ శాఖ చెబుతున్నది. వ్యవసాయ శాఖగానీ, పశుసంవర్ధక శాఖగానీ దీనిని తమ బాధ్యతగా స్వీకరించడం లేదు’’ అని వెల్లడించారు. దీంతో కోతుల నియంత్రణకు బాధ్యత వహించేవారే లేకుండా పోయారని అన్నారు.
ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి
పంటల నష్టంతో రైతులు నష్టాల పాలుకాకుండా.. కోతులు, అడవి పందులు, నీల్‌గాయ్‌లాంటి జంతువుల బెడదను నియంత్రించేందుకు బాధ్యత వహించేలా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ(నోడల్ మినిస్ట్రీ)ను తక్షణమే ఏర్పాటు చేయాలని కేంద్ర సర్కారును కోరారు. అలాగే కోతుల నియంత్రణ, నివారణ, నిర్వహణ కోసం జాతీయస్థాయిలో స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని అన్నారు. రైతుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకు స్పెషల్ నేషనల్ ప్రోగ్రాం ప్రారంభించాలని సూచించారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లో ఈ కోతుల అంశం కీలకంగా మారిందని గుర్తు చేశారు. కోతుల బెడద పరిష్కరిస్తే.. సర్పంచ్‌గా గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు.
