చేవెళ్లకు మెట్రో తీసుకొస్తామనడం విడ్డూరం.. చేతనైతే ఎంఎంటీఎస్ తేవాలి:  కొండా విశ్వేశ్వర్​రెడ్డి

చేవెళ్లకు మెట్రో తీసుకొస్తామనడం విడ్డూరం.. చేతనైతే ఎంఎంటీఎస్ తేవాలి:  కొండా విశ్వేశ్వర్​రెడ్డి

శంషాబాద్, వెలుగు: చేవెళ్ల ప్రాంతానికి మెట్రో రైలు తీసుకొస్తానని సీఎం రేవంత్​రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి విమర్శించారు. చేతనైతే ముందు ఎంఎంటీఎస్ రైలు తీసుకురావాలని హితవు పలికారు. గురువారం శంషాబాద్ మండలం అమ్మపల్లి సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ఆయన ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ను ప్రారంభించారు. ముందుగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో కలిసి రామాలయంతోపాటు అభయాంజనేయ స్వామి ఆలయంలో విశ్వేశ్వర్​రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్​నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తానని, ప్రజల ఆశీస్సులు పొందుతానని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తానని తెలిపారు. పక్కనే గండిపేట జలాశయం ఉన్నా తాగునీటి కోసం చేవెళ్ల ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ప్రభుత్వం రాగానే కరెంట్​కోతలు మొదలయ్యాయన్నారు.

మూడు నుంచి నాలుగు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కాంగ్రెస్​పార్టీతోనే పోటీ అన్నారు. ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ.. చేవెళ్ల సీటును బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు. లోక్​సభ ఎన్నికలతో రేవంత్ రెడ్డి పతనం మొదలవుతుందన్నారు. నాయకులు కేఎస్ రత్నం, రవికుమార్ యాదవ్, తోకల శ్రీనివాస్ రెడ్డి, సామ రంగారెడ్డి, శ్రీరాములు, విశ్వేశ్వర్ రెడ్డి భార్య సంగీతారెడ్డి,  బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్  పాల్గొన్నారు.