కొండగట్టు అంజన్న సేవలు పిరం.. రూ. 400 ఉన్న అంతరాలయ దర్శనం ఇకపై రూ. 800 !

కొండగట్టు అంజన్న సేవలు పిరం.. రూ. 400 ఉన్న అంతరాలయ దర్శనం ఇకపై రూ. 800 !
  •  ఈ నెల 15 నుంచి అమల్లోకి...

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న సేవలు పిరం కానున్నాయి. అంజన్న ఆర్జిత సేవల టికెట్‌ రేట్లను పెంచినట్లు ఈవో శ్రీకాంత్‌ బుధవారం తెలిపారు. గతంలో రూ. 800 ఉన్న చందన పూజ టికెట్‌ను రూ. 1,500లకు పెంచగా.. రూ. 400 ఉన్న అంతరాలయ దర్శనాన్ని రూ. 800, రూ. 1,116 ఉన్న శాశ్వత అభిషేకం రేటును రూ. 10 వేలకు పెంచారు. ఆలయంలో కొత్తగా పలు రకాల ఆర్జిత సేవలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవ సమయంలో ప్రత్యేక దర్శనం టికెట్‌ రూ. 1000, శని గ్రహ పీడ నివారణ పూజ రూ. 1000, మన్యసూక్త హోమం రూ. 2 వేలు, వడమాల టికెట్‌ను రూ. 1,116గా నిర్ణయించారు. పెరిగిన ధరలు ఈ నెల 15 నుంచి అమల్లోకి వస్తాయని ఈవో చెప్పారు. 

అలాగే ఆలయానికి కొత్తగా పీఆర్‌వో ఆఫీస్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆలయానికి సంబంధించిన 11 ఎకరాల భూమిని చదును చేసి లీజుకు ఇస్తామన్నారు. మూలవిరాట్టుకు 60 ఏండ్ల నుంచి చందనం తొలగించలేదని.. కమిషనర్ ఆదేశాలు రాగానే చందనం తొలగింపు కార్యక్రమం ప్రారంభించి బేతాళునికి చందనోత్సవం జరిపిస్తామన్నారు.
ఈవో వెంట సూపరింటెండెంట్‌ సునీల్, హరిహరనాథ్‌, ప్రధాన అర్చకుడు జితేంద్రప్రసాద్, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, స్థానాచార్యులు కపిందర్‌ పాల్గొన్నారు.