చిన్న హనుమాన్ జయంతికి.. కొండగట్టు ముస్తాబు

చిన్న హనుమాన్ జయంతికి.. కొండగట్టు ముస్తాబు

కొండగట్టు, వెలుగు: చిన్న హనుమాన్​ జయంతికి జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం ముస్తాబైంది. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆలయంలో హనుమాన్  చిన్న జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్  దీపాలతో అలంకరించారు. భక్తులకు తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు వేశారు.

భక్తుల కోసం స్వామివారి 4 లక్షల లడ్డూ ప్రసాదాన్ని సిద్ధంగా ఉంచారు. హనుమాన్  దీక్షాపరులు పెద్ద ఎత్తున కొండగట్టుకు వచ్చే అవకాశం ఉండడంతో మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాల రద్దీతో ఇబ్బంది తలెత్తకుండా కొండగట్టు నుంచి జేఎన్టీయూ వరకు పది చోట్ల పార్కింగ్  స్థలాలను ఏర్పాటు చేశారు. మాలవిరమణకు అదనంగా అర్చకులను, తలనీలాలు తీసేందుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో అంజనారెడ్డి  తెలిపారు.   

25లక్షల లీటర్ల భగీరథ వాటర్

గుట్టపైన తాగునీటి అవసరాలకు, కోనేరులో నీటిని నింపేందుకు 25 లక్షల లీటర్ల నీటిని సిద్ధంగా ఉంచినట్లు మిషన్  భగీరథ అధికారులు తెలిపారు. గుట్టపైన తాగునీటి సమస్య తలెత్తకుండా మూడు రోజుల పాటు పర్యవేక్షిస్తామని చెప్పారు. జయంతి ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఐ నీలం రవి తెలిపారు. ఐదుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 80 మంది ఎస్సైలతో పాటు వెయ్యి మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు.