ఏసీబీకి చిక్కిన కొండమల్లేపల్లి ఆర్ఐ

ఏసీబీకి చిక్కిన కొండమల్లేపల్లి ఆర్ఐ

దేవరకొండ/ కొండమల్లేపల్లి, వెలుగు : నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి తహసీల్దార్​ఆఫీసు ఆర్ఐ పల్లా శ్రీనివాసరెడ్డి రూ.30 వేల లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కాడు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కథనం ప్రకారం..మండల పరిధిలోని కేశ్యతండాకు చెందిన రైతు బాణావత్ లచ్చుకు  కొండమల్లేపల్లి మండలం కొలుముంతల్ పహాడ్ కు చెందిన పెద్దమ్మ, పెదనాన్నలు ఎకరం భూమి ఇచ్చారు. దీన్ని తన పేరుపై మార్చుకునేందుకు 2 నెలల క్రితం ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డిని కలవడంతో రూ.30 వేలు లంచం అడిగాడు. దీంతో లచ్చు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. లంచం ఇవ్వడానికి దేవరకొండలోని డిండి ఎక్స్ రోడ్ లో ఉన్న మీనాక్షి హోటల్ వద్దకు రావాలని ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డి సూచించడంతో గురువారం అక్కడికి వెళ్లాడు.

ఆర్ఐ తన కారులో కూర్చొని లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తర్వాత కొండమల్లేపల్లి తహసీల్దార్​ఆఫీసుకు తరలించి విచారించారు. తర్వాత కేసు నమోదు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేశారు. ఏసీబీ ఎస్ఐలు బి వెంకట్రావు,రామారావు, హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ అధికారులు లంచం డిమాండ్​చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు.