కోటగుళ్లు.. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు..

కోటగుళ్లు.. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు..

చారిత్రక ప్రదేశాలు ఎప్పుడూ చూడదగ్గవే. అక్కడి శిల్పాలు, కట్టడాలు చూస్తూ చరిత్రలోకి వెళ్లి రావచ్చు. కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆనవాళ్లు ఉన్న ఘన్ పూర్ కోటగుళ్లు చెప్పుకోదగ్గవి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘన్ పూర్ ఊళ్లో ఉన్నాయి ఈ కోటగుళ్లు. వీటిని పదమూడో శతాబ్దం తొలినాళ్లలో గణపతి దేవుడు కట్టించాడని చెబుతారు.

కోటగుళ్లని 'గణపేశ్వరాలయం' అని కూడా పిలుస్తారు. రెండు వరుసల ఇటుక గోడ ఉన్న ఆవరణలో ఈ గుళ్లు కట్టారు. ప్రధాన ఆలయంలో శివుడు కొలువై ఉంటాడు. స్టార్ షేప్ ఉన్న వేదిక మీద కట్టిన ఈ ఆలయ నిర్మాణ శైలి కర్నాటకలోని హొయసల టెంపుల్ని పోలి ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ ఒకప్పుడు ఇరవై రెండు చిన్న గుళ్లు ఉండేవి. అయితే వీటిలో చాలావరకు దెబ్బతిన్నాయి. ప్రతి గుడి సైజ్ డిజైన్ భిన్నంగా ఉండడం కోటగుళ్లు స్పెషాలిటీ. ఎర్రని ఇసుక రాతి స్తంభాల మీద చెక్కిన ఏనుగు బొమ్మలు, నాట్యగత్తెల బొమ్మలు ఆకట్టుకుంటాయి. ఏనుగు మీద సవారీ చేస్తున్న సగం మనిషి, సగం సింహం ఆకారంలో ఉన్న శిల్పం, గజకేసరి, గుర్రం తల - ఏనుగు శరీరం ఉన్న శిల్పం వంటివి ఇక్కడ కనిపిస్తాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున శిథిలావస్థలో ఉన్న 60 పిల్లర్ల కల్యాణ మండపం, వందకు పైగా ఇసుక రాయి, సున్నపు రాయితో చేసిన పిల్లర్స్ విరిగి పడి ఉంటాయి. గుడి ఆవరణలో తవ్వకాల్లో బయటపడిన విగ్రహాల్ని టూరిస్టులు చూసేందుకు అక్కడే ఏర్పాట్లు చేసింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. కోటగుళ్లలో రామప్ప, వేయి స్తంభాల గుడిని పోలిన నిర్మాణ శైలి కనిపిస్తుంది.

ఇలా వెళ్లాలి

వరంగల్ నుంచి అరవై కిలోమీటర్ల జర్నీ చేస్తే ఘన్పూర్ కోటగుళ్లకి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి అయితే 140 కి.మీ.