పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారినైనా చేరదీసే హైదరాబాద్ సిటీలో.. మంచితనాన్ని బలహీనతగా భావించి చోరీలకు, నేరాలకు పాల్పడుతున్నారు దొంగలు. పనిమనుషులుగా చేరి మంచి వారిగా నటించి.. సమయం చూసి దోపిడీచేసి పారిపోతున్నారు. 2025 నవంబర్ 15 వ తేదీన సిటీలోని కార్ఖానాలో ఓనర్ ను కట్టేసి 50 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు ఆ ఇంటి పనిమనుషులు.
కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలి గ్యాంగ్ దొంగతనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో పనిలో చేరిన నేపాలి దంపతులు.. తిన్నింటి వాసాలు లెక్కపెట్టినట్లు.. ఆసరా కల్పించిన ఓనర్ పైనే దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. రాజ్, పూజ అనే నేపాలి దంపతులు రిటైర్డ్ కల్నల్ గిరి ఇంట్లో 25 రోజుల క్రితం పనిలో చేరారు. నవంబర్ 15వ తేదీన ఓనర్ గిరి.. వాళ్ళ బంధువు మరణించడంతో భార్యతో కలిసివెళ్లారు. భార్యను అక్కడే ఉంచి రాత్రికి ఇంటికి తిరిగి వచ్చాడు.
ఇంటికి వచ్చిన గిరికి, అతని కుటుంబ సభ్యులకు మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చే ప్రయత్నం చేశారు నేపాలి పనిమనుషులు. మూర్ఛ పోయారని నిర్ధారించుకున్నాక.. మరో నలుగురితో కలిసి దొంగతనానికి స్కెచ్ వేశారు. ఓనర్ గిరి ప్రతిఘటించడంతో తాళ్లతో కట్టేసి కర్రతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న18తులాల బంగారంతో పాటు 95,000 రూపాయల నగదుతో కారులో వెళ్లిపోయారు.
ఓనర్ గిర ఫిర్యాదు మేరకు ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. నేపాలి దంపతులు, మరో నలుగురు ఈ అఫెన్స్ లో పాల్గొనట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ఆరు టీం లను రంగంలోకి దింపారు. నేపాల్ బార్డర్ దగ్గర కూడా అధికారులను అప్రమత్తం చేశారు పోలీసులు.
