- మెరుగైన క్యూ4 రిజల్ట్స్ ప్రకటించిన కోటక్, ఐడీబీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఆర్‌బీఎల్
న్యూఢిల్లీ: ఎనలిస్టుల అంచనాలను మించిన రిజల్ట్స్‌ను బ్యాంకులు ప్రకటిస్తున్నాయి. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐడీబీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, ఆర్‌బీఎల్ బ్యాంకులు మార్చి క్వార్టర్ (క్యూ4) గాను మెరుగైన రిజల్ట్స్‌ను ప్రకటించాయి. వీటి అసెట్ క్వాలిటీ మెరుగవ్వడంతో పాటు, వడ్డీ ఆదాయం కూడా పెరిగింది.
4.12 కోట్లకు కోటక్ బ్యాంక్ కస్టమర్లు
కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో రూ. 3,495 కోట్ల నికర లాభం సాధించింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.2,767 కోట్లతో పోలిస్తే ఇది 26 శాతం ఎక్కువ. ఈ ప్రైవేట్ బ్యాంక్‌కు కిందటేడాది మార్చి క్వార్టర్‌లో రూ.4,512 కోట్ల నికర వడ్డీ ఆదాయం రాగా, తాజా క్యూ4 లో 35 శాతం పెరిగి రూ. 6,103 కోట్లకు చేరుకుంది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 5.75 శాతానికి మెరుగుపడింది. క్యూ4 లో 22 లక్షల మంది కొత్త కస్టమర్లను సాధించింది. దీంతో బ్యాంక్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.12 కోట్లకు పెరిగింది. కిందటేడాది మార్చి 31 నాటికి కోటక్ బ్యాంక్ కస్టమర్లు 3.27 కోట్లుగా ఉన్నారు. బ్యాంక్ అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. అడ్వాన్స్‌లలో బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో క్యూ4 లో ఏడాది ప్రాతిపదికన 1.9 శాతం నుంచి 1.78 శాతానికి, నెట్ ఎన్‌పీఏల రేషియో 0.43 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గింది.
భారీగా తగ్గిన ఐడీబీఐ ఎన్‌పీఏలు
ఐడీబీఐ బ్యాంక్ కూడా ఈ ఏడాది జనవరి – మార్చి క్వార్టర్‌లో అదరగొట్టింది. బ్యాంక్ నికర లాభం (స్టాండ్‌ఎలోన్) క్యూ4 లో ఏడాది ప్రాతిపదికన 64 శాతం పెరిగింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఐడీబీఐ బ్యాంక్‌కు రూ.691 కోట్ల నికర లాభం రాగా, తాజా క్యూ4 లో ఇది రూ.1,133 కోట్లకు ఎగిసింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ రూ.2,420.5 కోట్ల నుంచి 35 శాతం పెరిగి రూ.3,279.6 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ క్యాపిటల్ అడెక్వసీ రేషియో క్యూ4 లో 20.44 శాతంగా నమోదు కాగా, కిందటేడాది మార్చి క్వార్టర్‌లో ఇది 19.06 శాతంగా, డిసెంబర్ క్వార్టర్‌లో 20.14 శాతంగా ఉంది. మొండిబాకీలు, కాంటింజెన్సీల ప్రొవిజిన్లు క్వార్టర్లీ ప్రాతిపదికన 26 శాతం, ఏడాది ప్రాతిపదికన 47 శాతం పెరిగి రూ.983.63 కోట్లుగా రికార్డయ్యాయి. ఐడీబీఐ అసెట్ క్వాలిటీ భారీగా మెరుగుపడింది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌లో బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో 13.82 శాతం ఉండగా, తాజా క్యూ4 లో ఇది 6.38 శాతానికి తగ్గింది. నెట్ ఎన్‌పీఏల రేషియో 1.08 శాతం నుంచి 0.92 శాతానికి మెరుగుపడింది. షేరుకి ఒక్క రూపాయి డివిడెండ్‌గా ఇచ్చేందుకు ఐడీబీఐ బ్యాంక్ బోర్డు ఆమోదం తెలిపింది.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌కు రికార్డ్ లెవెల్ లాభం..
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కు ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో రికార్డ్ లెవెల్ లాభం వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.343 కోట్ల నెట్ ప్రాఫిట్ తో పోలిస్తే తాజా క్యూ4 లో 134 శాతం పెరిగి రూ.803 కోట్లకు చేరుకుంది. అదే డిసెంబర్ క్వార్టర్‌తో పోలిస్తే 32.7 శాతం ఎగిసింది. బ్యాంక్‌కు ఇదే హయ్యస్ట్ క్వార్టర్లీ ప్రాఫిట్ కావడం విశేషం. ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌కు క్యూ4లో రూ. 3,597 కోట్ల నికర వడ్డీ ఆదాయం వచ్చింది. ఇది కిందటేడాది మార్చి క్వార్టర్‌లో వచ్చిన రూ.2,669 కోట్లతో పోలిస్తే 35 శాతం ఎక్కువ. బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 3.70 శాతంగా ఉండగా, తాజా క్యూ4 లో 2.51 శాతానికి తగ్గింది. నెట్ ఎన్‌పీఏ 0.86 శాతానికి మెరుగయ్యింది.
ఆర్‌బీఎల్‌కు 271 కోట్ల లాభం..
ఆర్‌బీఎల్ బ్యాంక్ నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో ఏడాది ప్రాతిపదికన 37 శాతం పెరిగి రూ.271 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం 7 శాతం గ్రోత్ సాధించి రూ.1,211 కోట్లుగా రికార్డయ్యింది. క్యూ4 లో ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు రూ.222 కోట్ల ప్రాఫిట్, రూ.1,219 కోట్ల నికర వడ్డీ ఆదాయం వస్తుందని ఎనలిస్టులు అంచనావేశారు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అంచనాల కంటే కొద్దిగా తగ్గింది. బ్యాంక్ గ్రాస్ ఎన్‌పీఏల రేషియో కిందటేడాది మార్చి క్వార్టర్‌లో 4.40 శాతంగా ఉండగా, తాజా క్యూ4 లో 3.37 శాతానికి తగ్గింది. కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌లో ఇది 3.61 శాతంగా రికార్డయ్యింది. నెట్ ఎన్‌పీఏల రేషియో ఏడాది ప్రాతిపదికన 1.34 శాతం నుంచి, క్వార్టర్లీ ప్రాతిపదికన 1.18 శాతం నుంచి 1.10 శాతానికి మెరుగుపడింది.