న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ2) లో కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం (స్టాండ్‌ఎలోన్) రూ.3,344 కోట్లకు పెరిగింది. కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో వచ్చిన రూ.3,191 కోట్లతో పోలిస్తే 5 శాతం వృద్ధి నమోదు చేసింది. మొత్తం ఆదాయం రూ.13,507 కోట్ల నుంచి రూ.15,900 కోట్లకు చేరుకుంది. క్యూ2 లో వడ్డీల ద్వారా రూ. 13, 216 కోట్ల ఆదాయాన్ని కోటక్ బ్యాంక్ పొందింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) ఏడాది ప్రాతిపదికన రూ.6,297 కోట్ల నుంచి 11 శాతం పెరిగి రూ.7,020 కోట్లకు చేరుకుంది.
నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (ఎన్‌ఐఎం) 4.91 శాతం నుంచి 5.22 శాతానికి వృద్ధి చెందింది. కోటక్ బ్యాంక్ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పీఏ) రేషియో కిందటేడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 1.72 శాతం ఉంటే, ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో 1.49 శాతానికి మెరుగుపడింది. నెట్ ఎన్‌పీఏల రేషియో మాత్రం 0.37 శాతం నుంచి 0.43 శాతానికి పెరిగింది. కన్సాలిడేటెడ్ బేసిస్‌లో కోటక్ బ్యాంక్‌కు క్యూ2 లో రూ.5,044 కోట్ల నికర లాభం వచ్చింది.