
గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్‌లో వరదలను దృష్టిలో పెట్టుకొని వెయ్యి కోట్ల రూపాయలతో సిటీ, చుట్టుపక్కల మున్సిపాల్టీలలో నాలాలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మార్చి, ఏప్రిల్‌నాటికి పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. రాయదుర్గం – శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. బొటానికల్ గార్డెన్ – కొండాపూర్ ఫ్లైఓవర్, కొత్తగూడ జంక్షన్ అండర్ పాస్‌ను ఆదివారం మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్తగూడ ఫ్లైఓవర్, అండర్‌పాస్ ఓపెనింగ్‌తో బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోని మరే నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. డ్రైనేజీ, మంచినీరు, కరెంటు సౌలత్‌లను ప్రజలకు పూర్తి స్థాయిలో చేరవేస్తున్నట్లు తెలిపారు. మూడేండ్లలో సిటీ రూపురేఖలు మారాయని, కొత్తగా నగరానికి వచ్చిన వారు ఆశ్చర్యపడే విధంగా అభివృద్ధి కొనసాగుతోందని తెలిపారు. ఎస్ఆర్డీపీలో భాగంగా 34 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు చెప్పారు.
50 ఏండ్లకు సరిపడేలా వాటర్ఫెసిలిటీ
నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రాబోయే 50 ఎండ్లకు సరిపడే విధంగా మంచినీటి వసతిని రెడీ చేస్తున్నట్లు తెలిపారు. అటు కాళేశ్వరం నీటితో పాటు ఇటు కృష్ణ జలాలను సుంకిశాల ప్రాజెక్టు ద్వారా సిటీకి తీసుకువస్తున్నామన్నారు. 2020లో నగరంలో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని వెయ్యి కోట్ల వ్యయంతో నగరంతో పాటు చుట్టుపక్కల మున్సిపాలిటీల్లో నాలాలను అభివృద్ధి చేసే కార్యక్రమం చేపట్టామని, రానున్న మార్చి, ఏప్రిల్ నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్ధేశించినట్లు తెలిపారు. దేశంలోని మహానగరాల్లో 100శాతం సివరేజీ ట్రీట్మెంట్ చేయబోతున్న నగరంగా హైదరాబాద్ అవతరించబోతుందన్నారు. ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు 3 వేల వరకు ఎలక్ట్రిక్ బస్సులను రాబోయే మూడునాలుగేండ్లలో ప్రవేశపెడుతామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ వాణిదేవి, మేయర్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ శ్రీలతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.