
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కు ఒక్కో అడ్డంకిని దాటుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ఇండియా (ఏఏఐ) బృందం ఇప్పటికే ప్రైమరీ సర్వే నిర్వహించింది. ప్రభుత్వం గుర్తించిన ల్యాండ్‌లో గుట్టలు ఉండటంపై ఏఏఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గుట్టల ఎత్తును పక్కాగా కొలించేందుకు ప్రభుత్వం సింగరేణి సాయం తీసుకోనుంది. సింగరేణి వద్ద ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో గుట్టల ఎత్తు, కొలతలను తీసుకుని ఆ నివేదిక ఇవ్వాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వరరావును కోరారు. దీంతో సర్వే నిర్వహించేందుకు సింగరేణి ముందుకు వచ్చింది.
సర్వే కోసం రూ. 38 లక్షలు విడుదల
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును పలుమార్లు కలిశారు. ఇక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎంకు విన్నవించారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు సాధనకు అన్ని ప్రయత్నాలు చేయాలని మంత్రులతో పాటు ఆఫీసర్లను సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆదేశించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ గవర్నమెంట్సర్వేకు సంబంధించి రూ. 38 లక్షలు ఇప్పటికే రిలీజ్ చేసింది. ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి కేంద్ర మంత్రిని పలుమార్లు కలిసి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. .
కొత్తగూడెం నియోజకవర్గంలోని గరీబ్ పేట ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు దాదాపు 700 నుంచి 900 ఎకరాల ల్యాండ్‌ను ఆఫీసర్లు గుర్తించారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవలి బృందం ఇక్కడకు వచ్చి కొత్తగూడెం పట్టణంతో పాటు చుంచుపల్లి, సుజాతనగర్ మండలాల్లో ఈ ల్యాండ్‌ను పరిశీలించింది. ప్రైమరీ రిపోర్టును విమానయాన శాఖతో పాటు ఎఏఐ ఉన్నతాధికారులకు బృందం పంపించింది. ల్యాండ్ బాగుందని చెప్పిన బృందం ఒకటి రెండు గుట్టలున్నాయని వాటితో ఇబ్బంది రావొచ్చని అనుమానాలు వ్యక్తం చేసింది.
పది రోజుల్లో సర్వే
ఎయిర్ పోర్టు అలైన్‌మెంట్‌ను కొంత మార్పులు చేసేందుకు బృందంతో ఆఫీసర్లు చర్చించారు. గుట్టల ఎత్తు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అడ్డంకిగా ఉండడంపై వాటిని కొలవడంతో పాటు ఎఏఐకి అవసరమైన నివేదికలను రూపొందించడంలో కొంత జాప్యం కలుగుతోంది. ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురామిరెడ్డి కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో శనివారం డైరెక్టర్ పా వెంకటేశ్వర్లును కలిశారు. సాయం అందించేందుకు సింగరేణి యాజమాన్యం ఒప్పుకుంది. ఈ వారం పది రోజుల్లో సర్వే చేసేందుకు ఒక బృందాన్ని పంపించనున్నట్టు డైరెక్టర్ పేర్కొన్నారు. సర్వే పూర్తయితే ఎయిర్ పోర్టు పనులు ముందుకు సాగే అవకాశాలున్నాయి.
15 ఏళ్లుగా
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదనను మొదటగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత బీఆర్‌ఎస్ గవర్నమెంట్లో మరోసారి ఎయిర్‌పోర్టు ఏర్పాటు తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో కొత్తగూడెం నియోజకవర్గంలోని పునుకుడు చెలక, పేట చెరువు, బంగారుజాల ప్రాంతాల్లో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసేందుకు ల్యాండ్ గురించి అధికారులు పరిశీలించారు. ఎఏఐ బృందం వచ్చి ల్యాండ్‌ను పరిశీలించింది. అయితే ఎయిర్ పోర్టుకు ఈ ల్యాండ్‌లో సరైన విజిబిలిటీ లేదని బృందం తేల్చి చెప్పింది. దీంతో అప్పటి బీఆర్‌ఎస్ సర్కార్ఎయిర్పోర్టు ఏర్పాటు విషయాన్ని పక్కన పెట్టింది. దీంతో పెండింగ్ లోఉన్న ఎయిర్ పోర్టు ప్రతిపాదనలు.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మళ్లీ ముందుకు కదులుతున్నాయి.