కమ్యూనిస్టుల గొంతుకగా ఉంటా: సాంబశివరావు

కమ్యూనిస్టుల గొంతుకగా ఉంటా: సాంబశివరావు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో కమ్యూనిస్టు గొంతుకగా ఉంటూ.. అక్రమ కేసులు, ఉపా చట్టాలకు వ్యతిరేకంగా.. ప్రగతిశీల శక్తుల తరఫున నిలబడుతానని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. మంగళవారం మగ్దుంభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్బంధాలు, అణిచివేతలు, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతానని తెలిపారు. నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ రైతాంగ సాయుధ పోరాటం చేసి తెలంగాణను విముక్తి చేసిందని చెప్పారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా పోయిందని విమర్శించారు. ధర్నాలకు పిలుపు ఇస్తే ముందస్తు అరెస్ట్​లు జరిగేవన్నారు. నిధులన్నీ కేసీఆర్ సొంతం అయ్యాయని, రాజకీయ నియామకాలు జరిగాయని చెప్పారు. అధికారం శాశ్వతం అనుకుని నిర్బంధాలకు పాల్పడితే ప్రజలు సహించబోరని, దీనికి ఈ అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యమన్నారు. కాంగ్రెస్, సీపీఐ పొత్తు బాగా కలిసి వచ్చిందని, కమ్యూనిస్టులు ఎటువైపు ఉంటే.. వారికే అధికారం వచ్చే చాన్స్ ఉంటుందనేది స్పష్టమైందన్నారు. 

దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం: నారాయణ

టూరిజం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్​లో జరిగిన అగ్ని ప్రమాదంపైన జ్యూడిషియల్ విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. వందల కోట్ల అవినీతి బయటపడుతుందనే కీలక ఫైళ్లు తగులబెట్టారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నదని, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్ లాంటి పరిస్థితి ఇక్కడ లేదన్నారు. ఇండియా కూటమి బలపడాలని కోరారు. దేశానికి బీజేపీ పాలన ఎంతో ప్రమాదకరమన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. అధికార అహం, కక్ష సాధింపు చర్యలు, అవినీతే బీఆర్ఎస్​ను ముంచాయన్నారు. మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ ప్రతిపాదిస్తే.. ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, ఈటీ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.