గన్ మిస్ ఫైర్ ... ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్

గన్ మిస్ ఫైర్ ... ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్
  • 5 నిమిషాల్లో డ్యూటీ దిగాల్సి ఉండగా ప్రమాదం
  • ఆసిఫాబాద్ జిల్లా కౌటాల  పోలీస్ స్టేషన్​లో ఘటన
  • ఎస్ఐ టెస్టులో క్వాలిఫై అయిన రజనీ

కాగజ్ నగర్, వెలుగు: గన్ మిస్ ఫైర్ అయి తూటా తగలడంతో తీవ్రంగా గాయపడిన  టీ ఎస్ ఎస్ పీ కానిస్టేబుల్ సూర రజనీ కుమార్ (29 )  ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ స్టేషన్ లో టీ ఎస్ స్పెషల్​పోలీసుల క్యాంపు కొనసాగుతోంది. ఇందులో గుడిపేట బెటాలియన్  ఏ  కంపెనీకి చెందిన సూర రజనీ కుమార్ కూడా ఉన్నారు.  ఉదయం 3 గంటలకు  సెంట్రీ గార్డ్ డ్యూటీ చేశాడు. 5 గంటలకు ఆయన డ్యూటీ దిగాల్సి ఉండగా 4.53 గంటలకు తన రిలీవర్​ పోరండ్ల సతీశ్​కు  కాల్ చేశాడు. సతీశ్​ గార్డ్​రూమ్​కు వెళ్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. పైకి వెళ్లి చూడగా రజనీ రక్తపుమడుగులో కనిపించాడు. ఎస్ ఎల్ ఆర్ తుపాకీ మిస్ ఫైర్ అయి.. బుల్లెట్​దవడ నుంచి దూసుకెళ్లి నుదుటి మీద నుంచి బయటకు వెళ్లింది. దీంతో రజనీ తీవ్రంగా గాయపడ్డాడు.  సీఐ బుద్దే స్వామి, ఎస్ఐ ప్రవీణ్  కుమార్ స్టేషన్ కు ​చేరుకొని అంబులెన్స్​ రావడం ఆలస్యం కావడంతో  పోలీసు వాహనంలోనే రజనీని కాగజ్ నగర్ లోని ప్రైవేట్ హాస్పి టల్ కు తీసుకెళ్లారు. కండిషన్​ సీరియస్​గా ఉండడంతో కరీంనగర్ లోని ప్రైవేట్​ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తుండగా  ఉదయం 10.40 గంటలకు రజనీ చనిపోయాడు. డెడ్​బాడీని పోస్ట్ మార్టం కోసం  మంచిర్యాల జిల్లా హాస్పిటల్ కు తరలించారు. రజనీ బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లికి చెందిన సూర లక్ష్మీ,  కొమురయ్యల కొడుకు.  ఇటీవల ఎస్ఐ పరీక్ష రాసి ఫిజికల్​ టెస్ట్​కు క్వాలిఫై అయ్యాడు. 2021, జులై లో కౌటాలలో జాబ్ లో చేరాడు. కొంతకాలం వేరేచోటుకు బదిలీ కాగా.. ఆరు నెలల కిందట  తిరిగి కౌటాల పీఎస్​కు వచ్చాడు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

రజనీ అంత్యక్రియలు మంగళవారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామ పంచాయతీలోని కుర్మగూడెంలో అధికార లాంఛనాలతో నిర్వహించారు.  రజనీ కుమార్ చితికి అతని తండ్రి కొమురయ్య నిప్పు పెట్టారు. అంత్యక్రియల్లో టీ ఎస్ఎస్ పీ 13 వ బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ ఎంఐ సురేష్, కౌటాల సీఐ బుద్దే స్వామి, తాళ్లగురిజాల ఎస్సై రాజశేఖర్, పలువురు బెటాలియన్ ఎస్సై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.