రైతుల కోసం కృషి వాస్ యాప్.. అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా దమ్మపేట మండలం ఎంపిక

రైతుల కోసం కృషి వాస్ యాప్.. అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా దమ్మపేట మండలం ఎంపిక
  • పంట సాగు ఖర్చు, పురుగులమందులు, ఎరువుల వాడకం తగ్గించేందుకు​ యాప్ రూపకల్పన 
  • సక్సెస్ రేట్​ను బట్టి  రాష్ట్రమంతా అమలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఆధునిక సాంకేతికతతో రూపొందించిన కృషి వాస్​యాప్ పంట సాగులో రైతులకు అండగా నిలవనుంది. జిల్లా వ్యవసాయశాఖ, కృషి వాస్​సంస్థ సంయుక్తంగా యాప్​ను అమల్లోకి తీసుకురానున్నాయి. ఇందుకోసం రాష్ట్రంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలాన్ని పైలెట్​ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. పంటసాగుకు అయ్యే ఖర్చు, పురుగు మందులు, ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలపై ఈ యాప్ ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించనున్నారు. 

కృషి వాస్ యాప్​తో లాభమేంటి..?

ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో రైతులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలతోపాటు పలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్​ను రైతులు తమ మొబైల్​లో డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి పంట సమస్యలున్నా ఈ యాప్​ద్వారా రైతులకు సమాచారం అందుతుంది. సాధారణంగా చీడపీడలు, వైరస్, తెగుళ్లు ఒకచోట ప్రారంభమై పంట మొత్తం విస్తరించిన తర్వాత రైతులు గుర్తిస్తారు. 

దీంతో చీడపీడలు, వైరస్​లు, తెగుళ్లను నివారించేందుకు రైతులు విచక్షణా రహితంగా పురుగు మందులు, ఎరువులు వాడుతారు. కానీ ఈ యాప్ ద్వారా పంటల్లో చీడపీడలు, వైరస్​లు, తెగుళ్లు ఏ ప్రాంతంలో వచ్చాయో గుర్తించే వీలుంటుంది. 

పైలెట్​ప్రాజెక్టుగా దమ్మపేట మండలం..

కృషి వాస్ యాప్​ను అమలు చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని దమ్మపేట మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ  మండలంలో ఆయిల్​పాం, వరి, పత్తి, మొక్కజొన్న, కొబ్బరి వంటి వైవిధ్యమైన పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా ఈ మండలంలో దాదాపు 40 వేల ఎకరాల్లో ఆయిల్ పాం సాగవుతోంది. అంతేకాకుండా ఆయిల్​పామ్​లో అంతర పంటలుగా జీడి మామిడి, కోకో, కొబ్బరి సాగు చేశారు. 

సాగు భూమి అంతా జియో ట్యాగ్..

దమ్మపేట మండలంలో కృషి వాస్ యాప్​ అమలులో భాగంగా మొదట సాగు భూమి మొత్తాన్ని జియో ట్యాగింగ్ చేస్తారు. ఈ యాప్​ ద్వారా పంట పరిస్థితిపై రోజువారీ అప్​డేట్​ ఎస్ఎంఎస్ ద్వారా అలర్ట్ వస్తుంది. 

రైతు పొలం వద్దకు పోకుండానే ఎప్పటికప్పుడు పరిస్థితిని ఈ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మొక్కలో బోరాన్, మెగ్నీషియం వంటి పోషకాల లోపం గుర్తించి అవసరమైన సస్య రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ఈ యాప్​పై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రతి గ్రామాని ఒక కృషి మిత్ర వలంటీర్​ను ఆ సంస్థ నియమిస్తుంది. ఈ వలంటీర్​ పంటలను జియో ట్యాగింగ్ చేస్తారు. మొబైల్​లో యాప్​ను డౌన్​లోడ్ చేసుకునేందుకు వలంటీర్లు సహకరిస్తారు. పంటల సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు.  

ఈ నెలలోనే అమలుకు సన్నాహాలు..

అగ్రికల్చర్​మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలంలో ఈ యాప్​ను ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు అధికారులు, కృషి వాస్ సంస్థ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ యాప్​ను దమ్మపేట మండలంలో అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బందికి యాప్​పై అవగాహన కల్పిస్తున్నారు. 

రైతు నేస్తంగా..

రైతు నేస్తంగా కృషి వాస్ యాప్​నిలుస్తుంది. ఈ యాప్​ను రాష్ట్రంలోనే మొదటి సారిగా దమ్మపేట మండలంలో ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ యాప్​పై రైతులకు అవగాహన కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ యాప్​ను రైతులు డౌన్ లోడ్​చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు. – రవి కుమార్, ఏడీఏ, అశ్వారావుపేట డివిజన్​