నదులకు పోటెత్తుతున్న వరద 

నదులకు పోటెత్తుతున్న వరద 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్నాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో వరద ఉప్పొంగుతోంది. రాష్ట్రంతో పాటు చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ లో కురుస్తోన్న వర్షాలతో మేడిగడ్డ నుంచి సీతమ్మ సాగర్‌‌‌‌ వరకు గోదావరి నది వరదతో కళకళలాడుతోంది. శ్రీరాంసాగర్‌‌‌‌ ప్రాజెక్టుకు మోస్తరు కన్నా ఎక్కువ వరదే వస్తోంది. ఎగువన కురుస్తోన్న వర్షాలతో ఆల్మట్టికి 43,066 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్టులో గురువారం ఉదయం వరకు 129.72 టీఎంసీలకు 58.95 టీఎంసీల నీళ్లు చేరాయి. తుంగభద్ర డ్యాంకు 60,941 క్యూసెక్కుల వరద వస్తోంది. 100.86 టీఎంసీల ఈ డ్యాంలో 58.21 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. రాష్ట్రంలోని జూరాల, రెండు రాష్ట్రాల కామన్‌‌‌‌ ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్‌‌‌‌కు వరద రావడం లేదు. శ్రీశైలానికి 40 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో ఉంది. 
గోదావరి బేసిన్ లో.. 
గోదావరి బేసిన్‌‌‌‌లో ఎస్సారెస్పీకి ఉదయం 22 వేల క్యూసెక్కులకు పైగా వరద రాగా సాయంత్రానికి 19 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. 90.31 టీఎంసీలకు 31.21 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టుకు 1,900 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టులో 29.91 టీఎంసీలకు 19.36 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎల్లంపల్లికి 16,804 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ రిజర్వాయర్‌‌‌‌లో 20.18 టీఎంసీలకు 11.64 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.

సుందిళ్ల బ్యారేజీకి 5 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని కిందికి వదిలేస్తున్నారు. అన్నారం బ్యారేజీకి 4,100 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో ఉండగా 10,800 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత, గోదావరి నుంచి 78,930 క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండగా 92,720 క్యూసెక్కులు నదిలోకి వదిలేస్తున్నారు. సమ్మక్క బ్యారేజీకి గోదావరి, ఇంద్రావతి నుంచి 1.10 లక్ష క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తుండగా, అంతే నీటిని వదిలేస్తున్నారు. సీతమ్మసాగర్‌‌‌‌కు 1,23,760 క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే నీటిని నదిలోకి వదిలేస్తున్నారు. ఇంకో రెండు, మూడు రోజులు సాధారణం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రాజెక్టులకు నిలకడగా వరద కొనసాగే చాన్స్ ఉంది.
కడెం ప్రాజెక్టు మూడు గేట్లు ఓపెన్

కడెం, ఆసిఫాబాద్, వెలుగు: కడెం ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. నాలుగు రోజలుగా ఎగువన పడుతున్న వానలకు ప్రాజెక్టులోకి గురువారం 7,223 క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 16,631 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 693.775 అడుగుల నీటి మట్టం ఉంది. కుమ్రంభీం ప్రాజెక్టు కూడా వరద పెరుగుతుండటంతో అధికారులు గురువారం రెండు గేట్లు ఏత్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10.393 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీళ్లు 8.799 టీఎంసీలకు పెరిగాయి. ఇన్ ఫ్లో 3,299 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,092 గా ఉంది.