
నరేష్, పవిత్ర లోకేష్ జంటగా ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మళ్లీ పెళ్లి’. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ నిర్మించిన ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ ‘ఈ కథ సమాజానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు, ఆలోచనలు ప్రస్తుత సొసైటీలో ఉన్నాయి. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఎం.ఎస్.రాజు గారు కథ చెప్పినప్పుడు నచ్చింది. నరేష్ గారు, నేను కలిసి చేస్తేనే ఇది బాగుంటుందన్నారు. రాజు గారి నిర్మాణంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ అనే సినిమా చేశాను. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నటించడం హ్యాపీ. ఆయన చాలా యూత్ ఫుల్, ట్రెండీగా ఆలోచిస్తారు. ఇది ఎవరినీ టార్గెట్ చేసిన సినిమా కాదు.
నా విషయానికే వస్తే .. కొందరు పరిస్థితులని అడ్డుపెట్టుకొని చాలా తప్పుగా చూపారు. నా వ్యక్తిత్వం హననం చేసి, నా కెరీర్‌పై బ్లాక్ మార్క్ పెట్టాలని చూశారు. దీని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఒంటరిగా వుంటే ఆత్మహత్య చేసుకోవాలి లేదా ఇంట్లోనే కూర్చోవాలనిపించేది. కానీ నేను బయటికివచ్చానంటే కారణం నరేష్ గారు. నా వెనుక బలంగా నిల్చున్నారు. అన్ని విషయాల్లో సపోర్ట్ చేశారు. మేమిద్దరం కలిసినప్పుడు విజయ నిర్మల గారి ఆరోగ్యం అంతగా బాలేదు. ఆమెతో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాలేదు. కానీ కృష్ణ గారితో చాలా సమయం గడిపాం. ఆయనతో మాట్లాడటం, ఎన్నో విషయాలని పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో అదృష్టంగా భావిస్తున్నా. మహేష్ బాబు గారిని కూడా కలిశాను. ఫ్యామిలీ మమ్మల్ని యాక్సెప్ట్ చేసింది’ అని చెప్పారు.