సంగమేశ్వరం గర్భాలయాన్ని తాకిన కృష్ణా జలాలు

 సంగమేశ్వరం గర్భాలయాన్ని తాకిన కృష్ణా జలాలు
  • మళ్లీ స్వామి దర్శనానికి 8 నెలలు అగాల్సిందే
  • ఈ ఏడాది చివరి పూజలు చేసిన అర్చకులు
  • మంగళహారతులతో కృష్ణమ్మకు చీర సారే సమర్పణ

శ్రీశైలం డ్యామ్ కు ఎగువన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న సంగమేశ్వర ఆలయం క్రమంగా నీట మునుగుతోంది. భారీ వర్షాల ప్రభావంతో ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండడంతో కృష్ణా నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం డ్యాం నీరు ఎక్కువ భాగం నిలిచి ఉండే సప్తనదుల సంగమం.. సంగమేశ్వరం వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని లలితా సంగమేశ్వరుడిని తాకాయి కృష్ణా జలాలు. భారీ వర్షాలు, వరదలతో ఆలయం ప్రాంగణంలో నీళ్లు  వచ్చాయి. స్వామి గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని తాకాయి. 

కృష్ణా నదిలో నీటిమట్టం లేని సమయాల్లో గత ఏడాది 130 రోజులు భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. ఇప్పుడు మళ్లీ నీట మునుగుతుండడంతో మళ్లీ స్వామి దర్శనం కలగాలంటే భక్తులు 8 నెలలు ఆగాల్సిందే. స్వామి వారికి ఈ ఏడాది చివరి పూజలు చేశారు అర్చకులు. కృష్ణమ్మకు చీర సారే సమర్పించి మంగళ హారతులు ఇచ్చారు.

తెలంగాణ పరిధిలోని సోమశిల సమీపంలోని సప్త నదులు  కలిసే చోట ఉన్న సంగమేశ్వర ఆలయం ప్రతీ ఏటా నీట మునిగిపోతుంది. కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు కనిపించే ఈ పవిత్ర ఆలయం....  ఈ సారి కూడా కృష్ణా జలాల్లో మునిగింది. ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటారు. 
ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలుస్తాయి. ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేప లింగాన్ని దర్శించుకుంటే నరకం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు.