క్యారీ ఓవర్​ నీళ్లు ఇవ్వలేం.. ఇప్పటికే వాటాను మించి వాడుకున్నరు: కేఆర్ఎంబీ

క్యారీ ఓవర్​ నీళ్లు ఇవ్వలేం.. ఇప్పటికే వాటాను మించి వాడుకున్నరు: కేఆర్ఎంబీ
  •    రాష్ట్ర సర్కారుకు బోర్డు మెంబర్​ సెక్రటరీ లేఖ
  •     35 టీఎంసీలకే అనుమతి ఉన్నా 39.7 టీంఎసీలు వాడారు
  •     బోర్డు పర్మిషన్​ లేకుండా ఏకపక్షంగా తోడుకున్నారు
  •     పాలేరు, ఓకచెట్టివాగు, పాకాల చెరువు, కోటిపల్లివాగు డేటాను కేఆర్ఎంబీ సైట్​లో అప్​లోడ్​ చేయాలని ఆదేశం

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ అడిగినట్లు క్యారీ ఓవర్​ నీళ్లు ఇవ్వడం కుదరదని, తన వాటాను మించి వాడుకున్నదని కృష్ణా రివర్​  మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ) తెలిపింది. తెలంగాణ ఈఎన్​సీ, ఏపీ ఈఎన్​సీలు సభ్యులుగా ఉన్న కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీలో చేసుకున్న ఒప్పందాలకు అనుగుణంగా తెలంగాణ డిమాండ్​  లేదని పేర్కొంది. ఈ మేరకు శనివారం తెలంగాణ సర్కారుకు కేఆర్ఎంబీ మెంబర్​  సెక్రటరీ డీఎం రాయ్​పురే లేఖ రాశారు. నీళ్లు వాడుకోకుండా ఏపీని అడ్డుకోవాలని, తెలంగాణకు 18.7 టీఎంసీల క్యారీ ఓవర్​ నీటిని వాడుకునేలా అనుమతించాలని ఇటీవల కేఆర్​ఎంబీకి రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్  బొజ్జా లేఖ రాసిన సంగతి తెలిసిందే. దానికి తాజాగా కేఆర్​ఎంబీ మెంబర్​  సెక్రటరీ రిప్లై ఇచ్చారు. 

తాగునీటి కోసం వదిలే నీటిలో 20 శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే 2018 నుంచి 2020 వరకు చాలా మీటింగుల్లో చర్చించారని గుర్తుచేశారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ అంశాన్ని 2020 జూన్​లో సీడబ్ల్యూసీకి రెఫర్ ​ చేశారని పేర్కొన్నారు. సమస్యకు పరిష్కారం దొరకలేదు కాబట్టి కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్​ 2కు రిఫర్​ చేశారని, ఆ వెంటనే సీడబ్ల్యూసీ రిప్లై ఇచ్చిందని చెప్పారు. ఆ లెటర్​ను అదే ఏడాది రెండు రాష్ట్రాలకు పంపించామన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని తప్పుబడుతూ తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని, కేడబ్ల్యూడీటీ 1 నిర్ణయాలను అమలు చేయాలని డిమాండ్​ చేసిందని అన్నారు. అయితే, మరోసారి జరిగిన 17వ బోర్డు మీటింగ్​లో మ్యాటర్​ను కేడబ్ల్యూడీటీ2కి రిఫర్​ చేసేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని గుర్తుచేశారు. 

తెలంగాణ వాడేసుకుంది

ఉమ్మడి ప్రాజెక్టుల్లో తెలంగాణ తన వాటా నీటిని వాడేసుకున్నదని కేఆర్​ఎంబీ మెంబర్​ సెక్రటరీ పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన వాడుకోదగిన నీటి వాటా కన్నా ఎక్కువే వాడేసిందన్నారు. 2023 సెప్టెంబర్​ 30 నాటికి ఉమ్మడి ప్రాజెక్టుల్లో 82.788 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఉందని, దానికి అనుగుణంగా ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు, తర్వాతి వాటర్​ ఇయర్​ అవసరాలకు 2.788 టీఎంసీలను కేటాయించామన్నారు. అయితే, మార్చి 10 నాటికి ఉన్న లెక్కల ప్రకారం తెలంగాణ 39.743 టీఎంసీలను వాడుకున్నదన్నారు. కేఆర్ఎంబీ రిలీజ్​ ఆర్డర్​  లేకుండానే తెలంగాణ ఏకపక్షంగా 4.743 టీఎంసీలను వాడేసుకున్నదన్నారు. కానీ, ఏపీ ఇప్పటిదాకా 41 టీఎంసీలే వాడుకుందని, మరో 3 టీఎంసీలు ఆ రాష్ట్రం వాడుకునేందుకు వీలుందన్నారు. అయితే, ప్రస్తుతం కృష్ణా బేసిన్​లో తీవ్ర లోటు ఉన్నందున 2 రాష్ట్రాలూ ఎండాకాలం అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఆ డేటా ఎందుకు అప్​లోడ్​ చేయలేదు?

నీటి వాడకంపై రెండు రాష్ట్రాలు సహకరించాల్సిన అవసరం ఉందని కేఆర్ఎంబీ మెంబర్​ సెక్రటరీ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలేరు, కోటిపల్లివాగు, ఓకచెట్టువాగు, పాకాల చెరువు ప్రాజెక్టుల వివరాలను కేఆర్ఎంబీ వెబ్​సైట్​లో అప్​లోడ్​ చేయలేదని ఆయన తెలిపారు. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఖలు రాసినా పట్టించుకోలేదని తెలిపారు. ఆయా ప్రాజెక్టుల డేటాను వెంటనే అప్​లోడ్​ చేయాలని ఆదేశించారు.