
బెంగళూరు: ఆ క్రికెటర్లకు ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడూ ఉప్పు–నిప్పులా ఉండే వీరు తాజాగా ఐపీఎల్ మెగా ఆక్షన్ తో మళ్లీ ఒకటే డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నారు. దీంతో వీరు ఎలా మెలుగుతారో అన్న ఆసక్తి నెలకొంది. ఇందులో మొదటి జోడీ రవి అశ్విన్–జోస్ బట్లర్ కాగా, మరో జోడీ క్రునాల్ పాండ్యా–దీపక్ హుడాలది. మెగా ఆక్షన్ లో అశ్విన్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఇప్పటికే బట్లర్ తో పాటు కెప్టెన్ శాంసన్, జైస్వాల్ ను రిటైన్ చేసుకుంది. ఇప్పుడు అశ్విన్, బట్లర్ ఒకే డ్రెస్సింగ్ రూమ్ పంచుకోనున్నారు. అయితే 2019 సీజన్ లో పంజాబ్–రాజస్థాన్ మ్యాచ్ టైమ్‌లో బట్లర్ ను మన్కడింగ్ ద్వారా ఔట్ చేసి అశ్విన్ వార్తల్లో నిలిచాడు. అప్పటి నుంచి బట్లర్, అశ్విన్ ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. ఇప్పుడు వీరిద్దరూ ఒకే టీమ్ లోకి రావడం ఆసక్తిగా మారింది.
బరోడా విడదీసింది.. లక్నో కలిపింది..
ఈ ఆక్షన్ లో క్రునాల్ పాండ్యా (రూ.8.25 కోట్లు), దీపక్ హుడా (రూ.5.75 కోట్లు)ను లక్నో కొన్నది. అయితే డొమెస్టిక్ టోర్నీల్లో బరోడా టీమ్‌లో కలిసి ఆడిన టైమ్‌లో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ముందు బరోడా టీమ్ కెప్టెన్ గా ఉన్న పాండ్యా తనను తిట్టి, టీమ్‌లో చాన్స్ ఇవ్వనని బెదిరించాడని హుడా ఆరోపించాడు. ఈ వివాదంపై విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోసియేషన్ హుడాదే తప్పంటూ టీమ్ నుంచి అతడిని సస్పెండ్ చేసింది. దాంతో హుడా బరోడా టీమ్‌కు గుడ్‌బై చెప్పి రాజస్థాన్ టీమ్ తరఫున బరిలోకి దిగాడు. ఇప్పుడు ఐపీఎల్ లో లక్నో టీమ్ లో పాండ్యాతో కలిసి ఆడనున్నాడు. అప్పుడు కుస్తీ పట్టిన ఈ ఇద్దరూ ఇప్పుడు దోస్తులుగా మారనున్నారు.
మరిన్ని వార్తల కోసం..