ప్రజలు ఆగం కావద్దు.. ఆలోచించి ఓటేయాలి : కేటీఆర్

ప్రజలు ఆగం కావద్దు.. ఆలోచించి ఓటేయాలి  :  కేటీఆర్

కాంగ్రెస్, బీజేపీ లీడర్లు పచ్చి మోసగాళ్లని, ఎన్నికల్లో లబ్ధి కోసమే మాయమాటలు చెప్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశాన్ని 55 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీజేపీ పదేండ్ల పాలనలోనూ ఒరిగిందేమీ లేదని అన్నారు. ఆ రెండు పార్టీల నాయకుల మాటలు నమ్మి ఆగమాగం కావద్దని, తెలంగాణకు మేలు చేసే పార్టీ ఏదో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

శుక్రవారం ఆయన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావుతో కలిసి మంచిర్యాలలో రోడ్​షో నిర్వహించారు. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్య జాన్సన్ నాయక్​కు మద్దతుగా జన్నారం మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ హయాంలో అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలిసేది కాదన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా జరుగుతోందన్నారు.

మన జుట్టు ఢిల్లీ చేతిలో పెట్టొద్దు

గొప్పలు చెప్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రతి దానికి ఢిల్లీపైనే ఆధారపడుతారని, బీఆర్ఎస్​కు తెలంగాణ ప్రజలే బాస్​లని కేటీఆర్ అన్నారు. మన జుట్టు ఢిల్లీ చేతుల్లో పెట్టొద్దని చెప్పారు. ఇక్కడ కేసీఆర్​ను ఎదుర్కొనేందుకు చేతగాక కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఇతర రాష్ట్రాల నుంచి ఉద్దెర నాయకులను తెచ్చుకుంటున్నారని విమర్శించారు. ఆ పార్టీల నాయకులు రాహుల్ గాంధీ, నరేంద్రమోదీ చేతుల్లో కీలుబొమ్మలని దుయ్యబట్టారు. ఎవ్వరేమన్నా తెలంగాణకు మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని చెప్పారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ చేతిలో తెలంగాణను పెట్టొద్దన్నారు. 

ఐటీ హబ్బు కావాల్నా.. పేకాట క్లబ్బు కావాల్నా? 

మంచిర్యాల ప్రజలు మంచిని కోరుకుంటారని, మళ్లీ మంచికే ఓటేస్తారని కేటీఆర్ అన్నారు. రెవెన్యూ డివిజన్ గా ఉన్న మంచిర్యాలను జిల్లా చేసిన ఘనత కేసీఆర్ దే అన్నారు. సింగరేణి కార్మికులకు చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా లాభాల్లో వాటా 32 శాతం ఇచ్చామని, వెయ్యి కోట్ల బోనస్ చెల్లించామని చెప్పారు. మంచిర్యాలలో ఐటీ హబ్ కావాల్నా.. పేకాట క్లబ్బు కావాల్నా ప్రజలు తేల్చుకోవాలన్నారు. ‘‘జాన్సన్​ను గెలిపిస్తే ఖానాపూర్​ను దత్తత తీసుకుంటా.. ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్​ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా..” అని కేటీఆర్​అన్నారు. రూ.794 కోట్లతో కుఫ్టి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​ ను పూర్తి చేస్తామని, కడెం ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని అన్నారు. అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. కాంగ్రెస్ హయాంలో 2013లో అశాస్త్రీయంగా టైగర్ జోన్​ను ఏర్పాటు చేశారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టైగర్ జోన్​లో విధించిన ఆంక్షలను తొలగిస్తామని హామీ ఇచ్చారు.

సాఫ్ట్​వేర్ లాగే.. రాష్ట్రం అప్టేడ్ అవుతున్నది: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: సాఫ్ట్​వేర్ ఎప్పటికప్పుడు అప్​డేట్ అవుతున్నట్టే.. తెలంగాణ డెవలప్​మెంట్ వెర్షన్ కూడా అప్టేడ్ అవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ 3.0 వెర్షన్.. డెవలప్​మెంట్ ఐకాన్​గా నిలుస్తున్నదని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో నిర్వహించిన ‘బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ సమిట్​’లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే ప్రభుత్వంలో ఐదు రంగాలను అద్భుతంగా డెవలప్ చేస్తామని, దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. టూరిజం, స్పోర్ట్స్, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్, హెల్త్​కేర్, ఐటీ అండ్ ఆంట్రప్రెన్యూర్ షిప్ విభాగాలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.

 ‘‘వచ్చే ప్రభుత్వంలో టూరిజం డిపార్ట్​మెంట్ ఇవ్వాలని సీఎంను బతిమాలుకుంటా. సోషల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై ఫోకస్ పెట్టాం. మెడికల్, స్పిర్చువల్, అడ్వెంచర్, స్పోర్ట్స్, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. పీపీపీ మోడ్​లో అభివృద్ధికి ఆస్కారం ఉంది”అని కేటీఆర్ అన్నారు. ‘‘తొమ్మిదిన్నరేండ్ల మా పాలనలో గ్రీన్, పింక్, బ్లూ‌‌‌‌, రెడ్, ఎల్లో రివల్యూషన్లు సాధించాం. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫిషరీస్​కు తెలంగాణ అడ్డాగా మారింది”అని కేటీఆర్ తెలిపారు.