ఆటో డ్రైవర్లకు నెలకు 5 వేలు ఇవ్వాలి: కేటీఆర్

ఆటో డ్రైవర్లకు నెలకు 5 వేలు ఇవ్వాలి: కేటీఆర్
  • ఇప్పుడు రోజుకు 200 కూడా వస్తలే
  • మేం అధికారంలో ఉన్నప్పుడు 2 వేలు సంపాదించేటోళ్లు: కేటీఆర్​
  • ఆరున్నర లక్షల మంది డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది
  • ఆటోవాలాలు సూసైడ్​ చేసుకొనే పరిస్థితి వస్తదనుకోలేదని వ్యాఖ్య
  • ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ మహాధర్నాకు హాజరు
  • పదేండ్లలో తమకోసం ఏం చేశారని నిలదీసిన జేఏసీ నేతలు

ముషీరాబాద్, వెలుగు: పదేండ్లుగా రోజుకు దాదాపు రూ. 2 వేలు సంపాదించే స్థితిలో ఉన్న ఆటో కార్మికులు.. ఇప్పుడు 200 –300 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలోని దాదాపు ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, పెరిగిన పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలకు తగ్గట్టుగా ఆటో మీటర్​ చార్జీలు పెంచాలంటూ మంగళవారం రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ హైదరాబాద్​లోని ఇందిరా పార్కులో చేపట్టిన మహాధర్నాకు కేటీఆర్​ హాజరై, ప్రసంగించారు. 


ఆటో డ్రైవర్లు సూసైడ్​ చేసుకునే పరిస్థితి వస్తదని ఏనాడూ అనుకోలేదని, కాంగ్రెస్ ఆ పరిస్థితి తీసుకువచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ ఆటో ఎక్కి ఆటో డ్రైవర్ల సమస్యలు తీరుస్తానని రంగుల కల చూపించారని పేర్కొన్నారు. ఆటోలో తిరగడం కాదని, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు ఇస్తానన్న రూ. వెయ్యి ఎక్కడ అని ప్రశ్నించారు. వారికి నెలకు రూ. 5 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆర్టీసీ ఫ్రీ పథకానికి తాము వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మహాలక్ష్మి  స్కీమ్​ కింద మహిళలకు రూ.2,500 ఇస్తానని మాట ఇచ్చారని, అవి వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఇబ్బంది పెట్టేలా చట్టం చేసిందని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా.. జైల్లో పెట్టినా సరే ప్రజల కోసం పోరాడుతామని తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీఆర్ఎస్​ నేతలు  కాలేరు వెంకటేశ్, ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ఉన్నారు. 

మేం ఏ లీడర్లనూ ఆహ్వానించలే : జేఏసీ నేతలు

ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్​ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో  ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కొనసాగింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు వెంకటేశం, ఎండీ ఇమ్రాన్, శ్రీకాంత్, లింగం గౌడ్, ప్రవీణ్, డి. శ్రీనివాస్, ఎంఏ సలీం, ఎం. సత్తిరెడ్డి, మీర్జా రఫత్ బేగ్ మాట్లాడుతూ.. తాము ఏ పార్టీ లీడర్లను తమ ఆందోళనకు ఆహ్వానించలేదని, తమ జేఏసీ ఆధ్వర్యంలోనే నిరసన తెలుపుతున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్లకు పలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడంలేదని అన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం చెల్లిస్తామని చెప్పారన్నారు. మహాలక్ష్మి పథకం వల్ల ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలని కోరారు. గ్రేటర్​హైదరాబాద్ లో 20వేల కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చెల్లించాలని యాక్సిడెంట్ బీమాను రూ. 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 మోటార్ వాహనాల చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ధర్నాలో  మారయ్య, సీహెచ్​జంగయ్య, ఎస్. అశోక్, భిక్షపతి యాదవ్, ఎండీ ఒమర్ ఖాన్ పాల్గొన్నారు.

వచ్చిందే మీకోసంరా భయ్​.. లొల్లి పెట్టుడెందుకు? 

మహాధర్నా మొదలైన కొద్దిసేపటికే  ఎమ్మెల్యేలు కేటీఆర్, మాగంటి గోపీనాథ్ ఇందిరా పార్కు వద్దకు ఆటోలో చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ఆటో డ్రైవర్లు, యూనియన్​లీడర్లు ఆశ్చర్యపోయారు. కేటీఆర్​ మైక్​తీసుకొని ప్రసంగాన్ని ప్రారంభించగా.. వెనుక ఉన్న ఆటో కార్మికులు, వేదికపై ఉన్న జేఏసీ లీడర్లు ‘పదేండ్లు అధికారంలో ఉంది మీరే కదా.. మా కోసం ఏం చేశారు? ఓలా, ఉబెర్ తో మేం ఇబ్బందులు పడి ఆందోళనలు కూడా చేశాం. పట్టించుకున్నారా?’’  అని నిలదీశారు. దీనికి కేటీఆర్​స్పందిస్తూ..  ‘‘వచ్చిందే మీ కోసం రా భయ్​.. లొల్లి పెట్టుడెందుకు.. చెప్తా చెప్తా తమ్మీ.. తొందరపడకు..తమ్ముడు విను విను..బైస్​పెట్టుకోకు.. మీకోసం వచ్చినవాళ్లను మీరు అవమానించుకుంటే మీకే నష్టం.. నాకు పోయేదేం లేదు’’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించారు.  

అధికారం లేదు కాబట్టే ప్రతి ఆందోళనకు వస్తున్నరు

మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ధర్నా చేశాం. ఏ పొలిటికల్​పార్టీల లీడర్లను పిలువలేదు. కేటీఆర్ వచ్చేంత వరకు మాకు తెలియదు. దీన్ని మా ఆటో కార్మికులు వ్యతిరేకించారు. పదేండ్లలో బీఆర్ఎస్ ​ఆటో కార్మికులను పట్టించుకోలేదని మా వాళ్లు నిలదీశారు.  
- బి. వెంకటేశం, ఆటో జేఏసీ కన్వీనర్

బీఆర్ఎస్​ వల్లే రోడ్డున పడ్డాం

బీఆర్ఎస్ హయాంలో ఆటో కార్మికులకు అన్యాయం జరిగింది. యాదగిరిగుట్టపైకి ఆటోలను నిషేధించడంతో.. 300 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కేటీఆర్, హరీశ్​రావు సహా అప్పటి మంత్రులందరి చుట్టూ తిరిగినా ఫలితం లేదు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కొండపైకి ఆటోలను అనుమతించారు. 

- గడ్డమీది దేవేందర్ గౌడ్, ఐఎన్టీయూసీ ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు