బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్

బీఆర్ఎస్ కు 10 నుంచి 12 సీట్లు ఇస్తే.. కేంద్రంలో చక్రం తిప్పుతాం: కేటీఆర్

రంగారెడ్డి: పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమికి 200 చొప్పున సీట్లు కూడా రావన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  మే 13 జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 10 నుంచి 12 సీట్లు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పుతామని చెప్పారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా రాజేంద్రనగర్ లో నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. 

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రంజిత్ రెడ్డి తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేశారని, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలన్నారు. బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బహుబలి కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు కేటీర్. బలహీనవర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది... అది తప్పని నిరూపించాలని పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి సారిగా బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారని..  ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. పదేళ్ల పాలనలో ఎన్డీఏ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పదేళ్ల క్రితం క్రూడ్ ఆయిల్ వంద డాలర్లు ఉండగా.. ఇప్పుడు 84 డాలర్లు ఉందని.. మరి పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి  ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని కేటీఆర్ మండిపడ్డారు.