
ఎల్బీనగర్, వెలుగు: ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మంత్రి కేటీఆర్ నిరుద్యోగుల జపం చేస్తున్నాడని ఎల్బీనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి విమర్శించారు. తొమ్మిదేళ్లలో నిరుద్యోగులను పట్టించుకోని కేటీఆర్‌కు ఇప్పుడు వాళ్లు గుర్తుకువస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం బీఎన్ రెడ్డినగర్ డివిజన్లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బెంగళూరు సెంట్రల్ ఎమ్మెల్యే మునిరత్నం నాయుడుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు గుర్తుకురాని జాబ్ క్యాలెండర్ గురించి కేటీఆర్ ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ఎన్నికల ముందు కేటీఆర్ డ్రామాలు తారాస్థాయికి చేరాయన్నారు. ఓటమి భయంతోనే యూట్యూబ్ చానెల్స్ దగ్గరికి వెళ్లి వంటలు, స్టూడెంట్లతో ఫొటోషూట్ల కోసం ఆయన పరుగులు పెడుతున్నారన్నారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను నట్టేట ముంచిన కేటీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో జనం లేరని సామ రంగారెడ్డి తెలిపారు. కేటీఆర్‌కు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో జనం తగిన బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కళ్లెం రవీందర్ రెడ్డి, బీజేపీ నాయకులు, కాలనీల అధ్యక్షులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.