- ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘాల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించింది. కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని కలెక్టర్ కు క్షమాపణ చెప్పాలని గురువారం ఓ ప్రకటనలో సంఘం డిమాండ్ చేసింది. బాధ్యతగల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులపై దుష్ప్రచారం చేయడం ఆనవాయితీగా మారడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది.
Also Read:-కాంగ్రెస్తో బీజేపీ కలిసిపోయింది..
అధికారులు ఎన్నో సవాళ్ల మధ్య ప్రజలకు సేవ చేస్తున్నారని తెలిపింది. సివిల్ సర్వీసెస్‌లో ఉన్న అధికారిని కించపరిచేలా మాట్లాడటం తగదని పేర్కొంది. వ్యవస్థల గౌరవాన్ని నాయకులు కాపాడాలని హితవు పలికింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఓ ప్రకటనలో ఖండించింది. జిల్లా కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నం చేయడం సరికాదని అభిప్రాయపడింది. కలెక్టర్ గౌరవం కాపాడేందుకు తాము అండగా నిలబడతామని, కేటీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరింది.