అగ్రనేతల పర్యటనపై..అభ్యర్థుల ఆశలు

అగ్రనేతల పర్యటనపై..అభ్యర్థుల ఆశలు
  •     ఓరుగల్లుకు రేపు కేటీఆర్, ఎల్లుండి సీఎం రేవంత్​రెడ్డి
  •     28న కేసీఆర్​రోడ్​షో
  •     నెలాఖరులో మోదీని రప్పించే ప్లాన్​
  •     వేడెక్కిన వరంగల్​ రాజకీయాలు 

హనుమకొండ, వెలుగు : లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీలు స్పీడ్ పెంచాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, అభ్యర్థులు ఓ వైపు జనాల్లోకి ఉరుకులు, పరుగులు పెట్టడంతో పాటు చేరికలు, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో వరంగల్ లో ప్రచార వేడి మొదలవగా.. ఎంపీ టికెట్ గెలవడమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అగ్రనాయకులు ఓరుగల్లు బాట పడుతున్నారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్​రెడ్డి వరంగల్ లో రోడ్డు షోలు, ప్రచార సభలు నిర్వహించనుండగా, ఏప్రిల్ నెలాఖరులో బీజేపీ అగ్రనేతలు పర్యటించనున్నారు. ఇలా ప్రధాన పార్టీల అగ్రనేతలు ఓరుగల్లు బాట పడుతుండటంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది.

ఓ వైపు కేసీఆర్, కేటీఆర్, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి.. 

కడియం పార్టీ మార్పు తర్వాత కాంగ్రెస్, బీఆర్​ఎస్ మధ్య తీవ్ర వైరం ఏర్పడగా, ఎలాగైనా కడియంను ఓడగొట్టాలని గులాబీ పార్టీ కసిగా ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ను వరంగల్ కు తీసుకొచ్చి ఇక్కడి పరిస్థితులను చక్కదిద్దుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23న మాజీ మంత్రి కేటీఆర్ వర్ధన్నపేట కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ 28న వరంగల్ లో రోడ్డు షో నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్​అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం 24న మడికొండలో నిర్వహించే ప్రచార సభలో సీఎం రేవంత్​రెడ్డి పాల్గొననున్నారు.

ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు చెందిన వారే ఉండటం, ప్రజల్లో కూడా సానుకూల స్పందన ఉందనే ఉద్దేశంతో ఇక్కడి నేతలున్నారు. ఈ తరుణంలో సీఎం సభ మరింత కలిసి వస్తుందనే భావనలో ఉన్నారు. వరంగల్ ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకున్న బీజేపీ ఇక్కడికి పార్టీ అగ్రనేతలను తీసుకొచ్చే ప్లాన్ చేస్తోంది. ఈ నెల 24న బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ నామినేషన్ వేయనుండగా, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వస్తారని అందరూ భావించగా, ఆయన పర్యటన రద్దయినట్లు తెలిసింది. దీంతో 25న కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఇక్కడికి తీసుకొచ్చేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానుండగా, ఆయనను వరంగల్ కు తీసుకురావాలని ఇక్కడి నాయకులు భావిస్తున్నారు.  

జోరందుకున్న ప్రచారం..

వరంగల్ లోక్ సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ కాగా, ఇక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేశ్, బీఆర్ఎస్ నుంచి మారపెల్లి సుధీర్​ కుమార్ పోటీలో నిలిచారు. కాగా, పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో ప్రధానంగా కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. కడియం కావ్య మార్నింగ్ వాక్ లు నిర్వహిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా సోషల్ మీడియా వింగ్​తోపాటు పార్టీ వివిధ విభాగాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేశ్ కూడా ప్రచార స్పీడ్ పెంచారు. ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రచార రథాలు రెడీ చేయించి తిప్పుతున్నారు. బీఆర్​ఎస్ నుంచి బరిలో నిలిచిన డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ మాత్రం పార్టీ మీటింగులకే పరిమితం కాగా, నామినేషన్ వేసిన తర్వాత నుంచి ప్రచార కార్యక్రమాలు హోరెత్తించనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.