పెరిగిపోతున్న అసంతృప్తులను చల్లార్చేందుకు రంగంలోకి దింపిన కేటీఆర్​

పెరిగిపోతున్న అసంతృప్తులను చల్లార్చేందుకు రంగంలోకి దింపిన కేటీఆర్​

నల్గొండ, వెలుగు: త్వరలో ఎన్నికలు జరగనున్న మునుగోడు నియోజకవర్గంలో అసమ్మతి స్వరం వినిపిస్తున్న టీఆర్ఎస్​ లీడర్లను దారిలోకి తెచ్చేందుకు ఆ పార్టీ హైకమాండ్​ స్వయంగా రంగంలోకి దిగింది. బై ఎలక్షన్స్​లో టికెట్​ఆశించి, దాదాపు రాదనే సంకేతాలు అందుకున్న సీనియర్ ​నేతలు బూర నర్సయ్య గౌడ్​, కర్నె ప్రభాకర్​​, కర్నాటి విద్యాసాగర్ వ్యవహరిస్తున్న తీరు వల్ల పార్టీకి నష్టం తప్పదనే అంచనాకు వచ్చిన పార్టీ పెద్దలు  దిద్దుబాటు చర్యలకు దిగారు. ఇటీవల మంత్రి జగదీశ్​రెడ్డి లక్ష్యంగా బూర నర్సయ్యగౌడ్​ చేసిన కామెంట్లు పార్టీలో తీవ్ర కలకలం రేపాయి. అసంతృప్తులను ఇలాగే వదిలేస్తే ఆ ఎఫెక్ట్​ పార్టీ విజయావకాశాలపై పడుతుందని భావించిన మంత్రి కేటీఆర్​, వీరిని బుజ్జగించే బాధ్యతలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డికి అప్పగించారు. లెఫ్ట్​పార్టీలతో సంప్రదింపులు జరపడంతో పాటు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను కూడా హైకమాండ్​ ఆయనకే అప్పగించింది. దీంతో పల్లా శుక్రవారం నుంచి నియోజకవర్గంలో పర్యటించనుండడం ఆసక్తి రేపుతోంది. 

పార్టీలో 'బూర' ప్రకంపనలు..

మునుగోడు  బై ఎలక్షన్స్​లో కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్​, కర్నె ప్రభాకర్​, కర్నాటి విద్యాసాగర్, కంచర్ల కృష్ణారెడ్డి తదితరులు టికెట్​ ఆశించారు. హైకమాండ్​ మాత్రం ప్రభాకర్​రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఈయన పేరును ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవల మునుగోడు లీడర్లతో జరిగిన అంతర్గత సమావేశంలో టికెట్​ ప్రభాకర్ కే అని స్వయంగా సీఎం కేసీఆర్ ​చెప్పినట్లు తెలిసింది. దీంతో అసంతృప్తికి గురైన బూరనర్సయ్య గౌడ్,​ కర్నె ప్రభాకర్, విద్యాసాగర్​అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యంగా బూర నర్సయ్య గౌడ్​వివిధ వేదికలపై బీసీలకు టికెట్​ ఇవ్వాలని మాట్లాడడడమే కాకుండా ఇప్పటికీ రెండుసార్లు మంత్రి జగదీశ్​రెడ్డిని టార్గెట్​ చేసి మాట్లాడారు. నోటిఫికేషన్​కు టైం దగ్గర పడుతున్న టైంలో ఈ అసంతృప్త నేతలను కట్టడి చేయకపోతే పార్టీకి నష్టం కలుగుతుందని గ్రహించే పల్లాను హైకమాండ్​ రంగంలోకి దించింది. బూర నర్సయ్య గౌడ్​, కర్నెప్రభాకర్, కర్నాటి విద్యా సాగర్​లకు నచ్చజెప్పే బాధ్యతను మంత్రి కేటీఆర్ ​తీసుకున్నట్లు తెలిసింది. ఆయన సూచనల మేరకే రేపటి నుంచి నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్​రెడ్డి పర్యటించనున్నట్టు తెలిసింది. ఈ పర్యటనలో అసంతృప్త నేతలను బుజ్జగించడంతో పాటు రెడ్డి సామాజికవర్గం ఓటర్లను, ముఖ్యంగా గుడాటి రెడ్లను కాపాడుకునేందుకు..కూసుకుంట్ల ప్రభాకర్​ రెడ్డి, ఆయన సమీప బంధువైన భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి లాంటి లీడర్లతో కలిసి కార్యాచరణ రెడీ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్​తో పొత్తు పెట్టుకున్న సీపీఎం, సీపీఐ లీడర్లతో చర్చలు జరుపుతున్న పల్లా.. వాళ్ల డిమాండ్లను హైకమాండ్​ వద్దకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండు, మూడు రోజులుగా ఆయా పార్టీల అగ్రనేతలతో పల్లా హైదరాబాద్​లో చర్చలు జరిపారు.  స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మండల, గ్రామ శాఖల లీడర్లతో కూడా చర్చలు జరపాలని భావిస్తున్నారు. 

స్కీముల  ప్రచారానికి.. 

వేల కోట్ల అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం చేసుకోలేకపోతున్నామని టీఆర్ఎస్​హైకమాండ్​ భావిస్తోంది. ఈ క్రమంలోనే సర్కారు అమలు చేస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్​పై ఇంటింటి ప్రచారానికి పల్లాను వాడుకోవాలని నిర్ణయించింది.  రైతు బంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్​వంటి కీలకమైన స్కీంల అమలులో రాజేశ్వర్​రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆ పథకాలపై పల్లాకు మంచి పట్టు ఉంది. నల్గొండ–వరంగల్–​ఖమ్మం గ్రాడ్యుయేట్స్​ఎమ్మెల్సీ గా గెలుపొందిన పల్లాకు ఇక్కడి లీడర్లతో మంచి సంబంధాలున్నాయి. అందుకే ఆయనకు మునుగోడులో కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే పల్లా ఒకసారి మునుగోడు నియోజకవర్గంలోని రైతుబంధు కో ఆర్డినేటర్లు, మండల ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ప్రతి మండలానికి 50 మంది చొప్పున కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇన్​చార్జి ఎమ్మెల్యేలు ఆ కమిటీలను వెంటేసుకొని గ్రామాల్లో తిరిగి, రైతుబంధు, రైతుబీమా వల్ల రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను వివరిస్తారు.ఈమేరకు ఇప్పటికే పాంప్లెంట్స్​ ముద్రించారు. వీటిని ఇంటింటికీ పంచుతూ ఓట్లు అడగనున్నారు.