- ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కొత్త సంస్కృతిని తీసుకొచ్చిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రతి సందర్భంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి దారుణాలకు పాల్పడ లేదని ఆయన చెప్పారు. ఈ మేరకు ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు కేటీఆర్ లేఖ రాశారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ నుంచి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు అందిచాల్సిన చెక్కులను స్థానిక ఎమ్మెల్యే ను కాదని కాంగ్రెస్ నాయకులే పంపిణీ చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
‘‘అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభ కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యే లేకుండానే పూర్తిచేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలు ఎంతమాత్రం మంచివి కావు. గత ఏడు నెలలుగా వరుసగా ఇలాంటి ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. మా పార్టీ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. కానీ, మీరు వారికి అందుబాటులోకి రాలేదు. శాసనసభ్యుల హక్కులను, వారికి ఉండే ప్రొటోకాల్ ను పరిరక్షించే విషయంలో పూర్తి అధికారం మీదే. పార్టీలతో సంబంధం లేకుండా వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాల్సి ఉంది. దయచేసి ఎమ్మెల్యేల హక్కుల రక్షణ విషయంలో స్పీకర్ గా మీ అధికారాలను వినియోగించాలని కోరుతున్నాను. వెంటనే సీఎస్ సహా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను”అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.