ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రోద్బలంతోనే .. కేయూ విద్యార్థి నేతలపై దాడి

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రోద్బలంతోనే .. కేయూ విద్యార్థి నేతలపై దాడి
  • బిక్కాజిపల్లి సర్పంచ్, ఎంపీపీలపై ఎస్సీ,  ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి 
  • దుగ్గొండి ఎస్సై ,చెన్నారావుపేట ఎస్సైలను సస్పెండ్​ చేయాలి 
  • పోలీసులు ఖాకీ డ్రెస్​ తీసేసి బీఆర్ఎస్​ కండువాలు కప్పుకోవాలి 
  • స్టూడెంట్​ జేఏసీ చైర్మన్ ​తిరుపతి   

హసన్​ పర్తి(కేయూ క్యాంపస్​), వెలుగు : ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక అంతిమయాత్రలో పాల్గొన్న కేయూ విద్యార్థి సంఘాల నాయకులపై దాడి చేయడం హేయమైన చర్య అని జేఏసీ చైర్మన్​ తిరుపతి అన్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్ ​లీకేజీలు, గ్రూప్స్ ​పరీక్షల వాయిదా వల్ల నిరాశకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె స్వగ్రామంలో నిరసన చేపట్టిన విద్యార్థి నేతలపై బీఆర్ఎస్ ​గూండాలు దాడి చేశారని, ఇది పిరికిపందల పని అని అన్నారు.

కేయూలోని ఎస్డీఎల్​సీఈ వద్ద ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడి చేసిన బిక్కాజిపల్లి సర్పంచ్, ఎంపీపీలపై ఎస్సీ, ఎస్టీ  అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్​రెడ్డి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని, వెంటనే ఆయన విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. స్టూడెంట్లను గాయపరిచిన దుగ్గొండి ఎస్సై  పరమేశ్వర్, చెన్నారావుపేట ఎస్సై తోట మహేందర్ రెడ్డి లను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

 పోలీసులు కేసీఆర్ ​ప్రభుత్వానికి కాపలాదారులుగా మారారని, లీడర్లకు ఊడిగం చేసే పోలీసులు ఖాకీ డ్రెస్​ తీసేసి బీఆర్ఎస్​ కండువాలు కప్పుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్​ ప్రభుత్వానికి  విద్యార్థులు, నిరుద్యోగులు తగిన బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. కేయూ స్టూడెంట్ జేఏసీ నేతలు వలీ ఉల్లా ఖాద్రీ, ఆరెగంటి నాగరాజు, మేడ రంజిత్, ఇడంపాక విజయ కన్నా, మొగిలి వెంకట్ రెడ్డి, బొట్ల మనోహర్, బందిగ రాకేశ్, జగన్, వేణు పాల్గొన్నారు.