- ఏడేళ్లుగా స్వచ్ఛత కార్యక్రమాలు
- ఆదర్శంగా నిలుస్తున్న నేచర్ ఐకాన్ యూత్
మెదక్, మనోహరాబాద్, వెలుగు : మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామం పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తోంది. ఎక్కడా లేని విధంగా గ్రామ యువకులు 'నేచర్ ఐకాన్ యూత్' పేరిట ఏడేళ్లుగా వారం వారం శ్రమదానం చేస్తున్నారు. వారి కృషికి గుర్తింపుగా పలు అవార్డులు లభించాయి. కూచారం గ్రామ పరిధిలో పారిశ్రామిక వాడ ఉండడంతో అక్కడి పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేసేందుకు కూచారం గ్రామానికి చెందిన పదిమంది యువకులు 2017లో అప్పటి తూప్రాన్ ఎంపీడీవో, ప్రస్తుత జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీవో) శ్రీనివాస్ రావు ప్రోత్సాహంతో 'నేచర్ ఐకాన్ యూత్' అసోసియేషన్ ఏర్పాటు చేశారు. పరిశుభ్రత, పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ అసోసియేషన్ కార్యక్రమాలు చేపడుతోంది. ఇపుడు గ్రామంలో ఉన్న యువకులందరూ నేచర్ యూత్ ఐకాన్ సభ్యులే.
ప్రతి ఆదివారం శ్రమదానం
నేచర్ ఐకాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం యువకులు, స్టూడెంట్స్, పిల్లలు, గ్రామస్తులు కలిసి గ్రామంలోని ఓ ప్రాంతాన్ని ఎంచుకొని శ్రమదానం చేస్తారు. అ ప్రాంతంలో పేరుకునే చెత్తా చెదారం మొత్తం తొలగించి శుభ్రం చేస్తారు. ఎనిమిదేళ్లుగా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం కొనసాగుతోంది. 300 వారాల శ్రమదానం పూర్తయిన సందర్భంగా గత ఫిబ్రవరిలో గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేచర్యూత్ ఐకాన్ సభ్యులకు ఆఫీసర్లు ప్రశంసా పత్రాలు అందజేశారు.
పచ్చదనం పెంపొందించడంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ భూమి రెండెకరాలలో హరిత వనం పేరుతో పార్క్ ఏర్పాటు చేశారు. అందులో పూల, పండ్ల మొక్కలు నాటారు. అలాగే హరితవనంలో బుద్ధ విగ్రహం ఏర్పాటుచేసి సందర్శకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. గ్రామంలోని ఖాళీ ప్రదేశాల్లో నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు 2 వేలకు పైగా మొక్కలను నాటారు.
ప్లాస్టిక్ నిషేధం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రామంలో ప్లాస్టిక్ ను నిషేధించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అంతేగాక యూత్ సభ్యులు షార్ట్ ఫిల్మ్స్ ను సైతం తీశారు. ఇంటింటికీ, షాప్‌లకు జనప నార సంచులు పంపిణీ చేశారు. గ్రామంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న నిరుద్యోగులు, స్టూడెంట్స్ కోసం
నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు అందరూ డబ్బులు పోగుచేసి స్థానిక గవర్నమెంట్స్కూల్ప్రాంగణంలోని బిల్డింగ్‌ను రెనోవేషన్ చేసి జీఎమ్మార్ సహకారంతో లైబ్రరీ ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచారు. పలు సందర్భాల్లో గ్రామంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.
అవార్డులు
కుచారం గ్రామ యువకులు చేస్తున్న కృషిని గుర్తించి 2020లో అప్పటి కలెక్టర్ ధర్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఆదర్శ గ్రామ అవార్డ్ అందజేశారు. అలాగే 2021లో ఎన్జీవో సంస్ధ యువకులు చేస్తున్న కృషికి అభిష్టి సేవ పురస్కారాన్ని అందజేసింది. ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే గ్రామాన్ని రాష్ట్రం లోనే ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేసి చూపిస్తామని నేచర్ ఐకాన్ యూత్ సభ్యులు చెబుతున్నారు.