కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లి నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న గుడిసెలను హైడ్రా అధికారులు గురువారం తొలగించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం చేపట్టారు. దశాబ్దాలుగా తాము ఇక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నామని అధికారులతో పలువురు వాగ్వాదానికి దిగారు.
ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎఫ్టీఎల్పరిధిలో ఎటువంటి ఆక్రమణలను ఉపేక్షించేది లేదని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. ఆందోళనకారులను పక్కకు తప్పించి, గుడిసెలను పూర్తిగా తొలగించారు.
హైడ్రాను అభినందిస్తూ ర్యాలీ
హైడ్రా పనితీరును ప్రశంసిస్తూ గురువారం ఉదయం కూకట్పల్లిలోని నల్ల చెరువు వద్ద వాకర్స్ ర్యాలీ నిర్వహించారు. ఆక్రమణలు, కాలుష్యం నుంచి చెరువును కాపాడి అభివృద్ధి చేస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చెరువు అభివృద్ధి, పునరుద్ధరణ అంటే ఏమిటో హైడ్రా చూపించిందని స్థానికులు అభినందించారు. గతంలో చెరువు పక్కకు రావాలంటేనే ఊపిరి ఆడేది కాదని, ఇప్పుడు ఆహ్లాదకర వాతావరణం ఏర్పడిందని ఆనందం వ్యక్తం చేశారు. షటిల్కోర్టు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటు చేయాలని కోరారు.
