Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్ర సృష్టించిన RCB మాజీ బౌలర్‌

Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్ర సృష్టించిన RCB మాజీ బౌలర్‌

మధ్యప్రదేశ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్ లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసుకొని అరుదైన రికార్డ్ తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తం 5 వికెట్లు పడగొట్టి మధ్య ప్రదేశ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఖేజ్రోలియా ఖాతాలో హ్యాట్రిక్ కూడా ఉంది. దీంతో ఒక మధ్య ప్రదేశ్ బౌలర్‌ హ్యాట్రిక్ తీసుకోవడం రంజీ ట్రోఫీ చరిత్రలో మూడోసారి కాగా.. ఓవరాల్ గా 80వ హ్యాట్రిక్.  

శంకర్ సైనీ ఢిల్లీ తరపున 1988లో తొలిసారి హిమాచల్ ప్రదేశ్ పై ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత రాజస్థాన్ కు చెందిన మహ్మద్ ముధాసిర్ 2018లో రాజస్థాన్ పై ఈ ఫీట్ అందుకున్నాడు. బరోడా ఫాలో ఆన్ ఆడుతున్న సమయంలో 95 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ 2,3,4,5 బంతుల్లో కెజ్రోలియా వరుసగా రావత్, మహేష్ పిథియా, భార్గవ్ భట్, ఆకాష్ సింగ్‌ల వికెట్లను పడగొట్టాడు. తొలి 11 ఓవర్లో ఒక్క వికెట్ కూడా పడకపోగా ఆ తర్వాత రెండు ఓవర్లలోనే 5 వికెట్లతో తన మ్యాజిక్ చూపించాడు. 

Also Read: పొట్టోడు కాదు.. గట్టోడు.: డీజే అవతారమెత్తిన బవుమా

ఈ రోజు ముగిసిన ఈ మ్యాచ్ లో మధ్య ప్రదేశ్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మధ్య ప్రదేశ్ 454 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 132 పరుగులకే కుప్ప కూలింది. ఫాలో ఆన్ ఇవ్వడంతో మరోసారి బ్యాటింగ్ దిగి 270 పరుగులకే ఆలౌటై ఓటమిపాలైంది. 2018, 2019 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన ఖేజ్రోలియా..ప్రస్తుతం కోల్ కత్తా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్నాడు.