కర్నాటక అమ్మాయిలకు జేడీఎస్ ఎన్నికల హామీ

కర్నాటక అమ్మాయిలకు జేడీఎస్ ఎన్నికల హామీ

బెంగళూరు: కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే రైతుల కొడుకులను పెండ్లి చేసుకునే అమ్మాయిలకు రూ. 2 లక్షల నజరానా అందజేస్తామని జేడీఎస్ నేత, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ప్రకటించారు. సోమవారం కోలార్​లో జరిగిన ‘పంచతంత్ర’ ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘వ్యవసాయదారుల కొడుకులను పెండ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఎవరూ ముందుకు రావడంలేదని, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలంటూ ఓ వ్యక్తి నాకు వినతిపత్రం ఇచ్చాడు. అందుకే ప్రభుత్వం తరఫున ఓ స్కీం పెట్టాలన్న ఆలోచన వచ్చింది. మమ్మల్ని గెలిపిస్తే కర్నాటక యువకుల ఆత్మగౌరవాన్ని కాపాడే దిశగా ఇంకా అనేక స్కీంలను ప్రవేశపెడతాం’ అని ప్రకటించారు. 

హసన్ సీటుపై దేవెగౌడ ఫ్యామిలీలో చీలిక?

కర్నాటకలోని హసన్ అసెంబ్లీ సీటు విషయంలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ ఫ్యామిలీలో చీలిక ఏర్పడే పరిస్థితి నెలకొంది. దేవెగౌడ సొంత జిల్లా అయిన హసన్​లో 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా, పోయిన ఎన్నికల్లో 6 సీట్లను జేడీఎస్ సొంతం చేసుకుంది. హసన్ సీటును మాత్రం బీజేపీ ప్రీతమ్ గౌడ్ గెలుచుకున్నారు. ఈ సారి హసన్ సీటులో గెలవాలంటే పార్టీలోని ఒక సాధారణ కార్యకర్తను నిలబెట్టాలని దేవెగౌడ చిన్న కొడుకు కుమారస్వామి భావిస్తున్నారు. అయితే, హసన్ నుంచి తన భార్య భవానీ రేవణ్ణను పోటీ చేయించాలని అతని అన్న రేవణ్ణ పట్టుదలతో ఉన్నారు. భవానీకే టికెట్ ఇవ్వాలని ఆమె కొడుకులు హసన్ ఎంపీ ప్రజ్వల్, ఎమ్మెల్సీ సూరజ్ కూడా పట్టుబడుతున్నారు. ఈ వ్యవహారంపై కుమారస్వామి విచారం వ్యక్తం చేశారు. అయితే, హసన్ సీటుపై దేవెగౌడనే తుది నిర్ణయం తీసుకుంటారని, ఆయన మాటకు కట్టుబడి 
ఉంటామని రేవణ్ణ వెల్లడించారు.

రాజకీయాలకు ఈశ్వరప్ప గుడ్ బై 

బీజేపీ సీనియర్ నేత, కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం కేఎస్ ఈశ్వరప్ప(74)రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను స్వచ్ఛందంగా రిటైర్ అవుతున్నానని,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను పోటీకి దించొద్దని కోరుతూ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆయన మంగళవారం లేఖ రాశారు. అదేసమయంలో తనకు బదులుగా తన కొడుకు కేఈ కాంతేశ్ కు శివమొగ్గ టికెట్ ఇవ్వాలని ఈశ్వరప్ప కోరారని చెప్తున్నారు.