దినదినగండంగా నడుస్తున్న కర్నాటక సంకీర్ణ సర్కారుకు మరో షాక్ తగిలింది. సోమవారం ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేశ్ జారకిహొళి, ఆనంద్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్, జేడీఎస్ సర్కారు బలం 117కు తగ్గింది. వీరిలో కాంగ్రెస్ 77, జేడీఎస్ 37, బీఎస్పీ 1, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. బీజేపీకి 105 మంది సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్113. మరికొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ప్రభుత్వం మైనార్టీలో పడే ప్రమాదం ఉంది. ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా బీజేపీ కుట్రేనని సీఎం కుమారస్వామి మండిపడ్డారు.
అందుకే రాజీనామా చేశా..
ఆపరేషన్ లోటస్ కు లొంగి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను ఆనంద్ సింగ్ ఖండించారు. తన నియోజకవర్గం విజయనగర కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని, బళ్లారి జిల్లాలో జిందాల్ స్టీల్ కు 3,667 ఎకరాల భూమి విక్రయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజీనామా చేశానని చెప్పారు. స్పీకర్‌కు రాజీనామా లేఖ పంపిన తర్వాత రాజ్ భవన్‌లో గవర్నర్ వాజుబాయి వాలాను ఆనంద్ సింగ్ కలిశారు. రాజీనామా లేఖ కాపీని ఆయనకు అందజేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు కట్టుబడి ఉంటానా లేదా వెనక్కి తీసుకుంటానా అనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. బీజేపీ సర్కారులో మంత్రిగా పని చేసిన ఆనంద్ సింగ్ 2018 మేలో కాంగ్రెస్ లో చేరారు. ఆయన మళ్లీ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి, గోకాక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్ జారకిహొళి చెప్పారు.
బీజేపీవి పగటి కలలు: కుమారస్వామి..
కర్నాటకలో ఎమ్మెల్యేల రాజీనామాలపై అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. ‘‘న్యూజెర్సీలో కాళభైరవేశ్వరస్వామి ఆలయ శంకుస్థాపనలో ఉన్నా. అన్ని పరిణామాలను గమనిస్తున్నా. ప్రభుత్వాన్ని అస్థిరపరిచి అధికారంలోకి రావాలని బీజేపీ పగటి కలలు కంటోంది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
దానంతట అదే కూలుతుంది:యడ్యూరప్ప…
కర్నాటక సీఎం కుమారస్వామి ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప కౌంటర్ ఇచ్చారు. సంకీర్ణ సర్కారును కూల్చాల్సిన అవసరం లేదని, దానంతట అదే కూలుతుందన్నారు. దానికి తమ పార్టీది బాధ్యత కాదన్నారు. సంకీర్ణ సర్కారు కూలితే ప్రభుత్వ ఏర్పాటుపై ఆలోచిస్తామన్నారు.
అసమ్మతి నేతలతో కాంగ్రెస్ చర్చలు…
ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. మాజీ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం జి.పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్ అర్జెంట్‌గా సమావేశమయ్యారు. అసమ్మతి నేతలను బుజ్జగించాలని నిర్ణయించారు. మంగళవారం అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బెంగళూరు రావాలని పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. కర్నాటక పరిణామాలపై దృష్టిపెట్టిన హైకమాండ్, బెంగళూరు వెళ్లి నివేదిక ఇవ్వాలని కర్నాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ కె.సి.వేణుగోపాల్ ను ఆదేశించింది.
