ఆదివాసీ యోధునికి నివాళి .. పోరుగడ్డ జోడేఘాట్​లో  వారసుల ప్రత్యేక పూజలు

ఆదివాసీ యోధునికి నివాళి .. పోరుగడ్డ జోడేఘాట్​లో  వారసుల ప్రత్యేక పూజలు

ఆసిఫాబాద్/గుడిహత్నూర్,ఇచ్చోడ, వెలుగు: జల్, జంగల్, జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వంతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు గిరిజన ఆరాధ్య దైవం కుమ్రం భీం 83వ వర్ధంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్​లో గిరిజన సంప్రదాయాలతో కుమ్రం భీంకు పూజలు చేశారు. ఆదివాసీల ఆచారం మేరకు ఐదు గోత్రాలను సూచించేలా జెండాలు ఆవిష్కరించారు.

గుస్సాడి నృత్యాలు, గిరిజన సంప్రదాయ వాయిద్యాలు, నినాదాలతో జోడేఘట్ ప్రాంగణం మార్మోగింది. భీం సహచరుడు కుమ్రం సూరు వర్ధంతిని సైతం జోడేఘట్ లో నిర్వహించారు. కలెక్టర్ సహదేవురావు, ఐటీడీఏ పీఓ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్ కుమార్, అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వర్ రావు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఆత్రం బోజ్జీరావు, కన్వీనర్ పెందోర్ లక్ష్మణ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, ఉత్సవ కమిటీ సభ్యులు, ఆదివాసులు నివాళులు అర్పించారు.

ఆదివాసీల అస్థిత్వం కోసం పోరాడిన యోధుడు కుమ్రం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌‌ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీబాయి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ సభ్యురాలు కుస్రం నీలాబాయి అన్నారు. గుడి హత్నూర్ మండల కేంద్రంలోని భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మాన్కాపూర్‌‌ గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసీలు సాంప్రదాయ వాయిద్యాలతో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు.

జడ్పీటీసీ పతంగె బ్రహ్మానంద్, నేతకాని సంఘం రాష్ట్ర నాయకురాలు సర్పె సోంబాయి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చోడలో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తుడం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నాగేశ్, జేఏవైఎస్ రాష్ట్ర కో కన్వీనర్ మెస్రం ఆనంద్, ఏజెన్సీ చట్టాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు ఆత్రం మహేందర్, బీఎస్పీ నాయకుడు  మెస్రం జంగు బాపు పాల్గొన్నారు.