
- గెలుపోటములను శాసించేది సీపీఐ పార్టీయే...
కరీంనగర్, వెలుగు : మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు తమతో చేతులు కలిపిన కేసీఆర్... బీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత మాట మార్చి అహంకారంతో విర్రవీగిపోయారని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పుడు కమ్యూనిస్టులను దూరం చేసుకుని అధికారాన్ని పోగొట్టుకున్నామన్న బాధలో బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారన్నారు. సీపీఐ కరీంనగర్ జిల్లా మహాసభలను మంగళవారం సాయంత్రం స్థానికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ వేముల వెంకట్రాజం పార్టీ జెండాను, శ్రీరాముల రామచంద్రం అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన సభలో కూనంనేని మాట్లాడుతూ... గెలుపోటములను శాసించే పార్టీ సీపీఐ మాత్రమే అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను ఓడించడమే ప్రజలు చూశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సీపీఐ ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసి వచ్చి సీట్ల కేటాయింపులో అవగాహన చేసుకుంటే మంచిదని, లేదంటే మన సత్తా ఏంటే చూపించాలని నాయకులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి పాల్గొన్నారు.